NTV Telugu Site icon

PBKS vs KKR: బౌలర్లు అద్భుతం.. ఓటమి బాధ్యత నాదే: అజింక్య రహానే

Ajinkya Rahane Kkr

Ajinkya Rahane Kkr

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) ఓటమి బాధ్యతను తానే తీసుకుంటా అని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే అని పేర్కొన్నాడు. ఈ ఓటమి పట్ల కొంచెం నిరాశగా ఉందన్నాడు. ఈ ఓటమితో కుంగిపోమని, ఇక ముందు మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం అని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 16 పరుగుల తేడాతో ఓడింది. పంజాబ్‌ నిర్ధేశించిన 112 పరుగుల ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.

మ్యాచ్ అనంతరం కేకేఆర్ ఓటమిపై కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. ‘మ్యాచ్ గురించి వివరించడానికి పెద్దగా ఏమీ లేదు. మైదానములో ఏమి జరిగిందో మనమందరం చూశాము. మా ప్రయత్నం పట్ల కాస్త నిరాశగా ఉంది. కేకేఆర్ ఓటమి బాధ్యతను నేనే తీసుకుంటా. నేను తప్పు షాట్‌ ఆడాను, బంతి మిస్‌ అయి ఎల్బీగా ఔటయ్యాను. అంగ్‌క్రిష్‌ స్పష్టంగా లేడు, అంపైర్ కాల్ కావచ్చని చెప్పాడు. ఆ సమయంలో నేను అవకాశం తీసుకోవాలనుకోలేదు. జట్టుగా బ్యాటింగ్‌లో మేము విఫలమయ్యాం. ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పటిష్ట పంజాబ్‌ను 111 పరుగులకే పరిమితం చేశారు. ఇలాంటి పిచ్‌లపై పుల్‌ ఫేస్‌ బంతులను సులభంగా ఎదుర్కోవచ్చు కానీ.. స్పిన్‌ బౌలింగ్‌ను ఆడడం కష్టం. ఈ లక్ష్యాన్ని మేము సులభంగా ఛేదించాల్సింది. ఈ ఓటమితో కుంగిపోము, మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ సానుకూల ధోరణితోనే ఉన్నాం. ఇక ముందు మ్యాచ్‌ల్లో సానుకూలంగా ముందుకు వెళతాం. టోర్నమెంట్‌లో ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నాయి’ అని రహానే తెలిపాడు.