Site icon NTV Telugu

Abishek Porel: భారత జట్టులో చోటే నా లక్ష్యం!

Abishek Porel

Abishek Porel

భారత జట్టులో చోటే తన లక్ష్యం అని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్‌ పోరెల్‌ చెప్పాడు. ప్రస్తుతానికి ఢిల్లీ తరఫున ఆడుతూ పెద్ద స్కోర్లు చేయడంపైనే దృష్టి పెట్టా అని, భవిష్యత్తు లక్ష్యం మాత్రం టీమిండియాకు ఆడడమే అని తెలిపాడు. డీసీ కోచ్‌లు, కెప్టెన్‌ తనకు మద్దతుగా నిలుస్తున్నారని.. వారి సలహాలు, సూచనలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా అని అభిషేక్‌ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌.. 225 రన్స్ చేశాడు. ఢిల్లీ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ పోరెల్‌ (51; 36 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ… ‘లక్ష్యాన్ని ఛేదిస్తామనే పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగా. పిచ్‌ బాగుంది. మా బౌలర్లు బాగా బౌలింగ్‌ చేశాం. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్లలో అద్భుత బంతులు వేశారు. నా ఆటను ఆస్వాదించా. మ్యాచ్‌కు ముందు హేమంగ్‌ బదానీ, కెవిన్‌ పీటర్సన్‌తో మాట్లాడా. వారు ఇచ్చిన సలహాలు, సూచనలను మైదానంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశా. ఢిల్లీ కోచ్‌లు, కెప్టెన్‌ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ తరఫున పెద్ద స్కోర్లు చేయడంపైనే దృష్టి పెట్టా. నా భవిష్యత్తు లక్ష్యం మాత్రం భారత జట్టులో ఆడటమే’ అని తెలిపాడు.

Also Read: Gautam Gambhir: ‘ఐ కిల్‌ యూ’.. టీమిండియా కోచ్ గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపులు!

ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు విజయాలు సాధించింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఏప్రిల్‌ 27న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఢిల్లీ తలపడనుంది. బెంగళూరు కూడా మంచి ఫామ్ మీదుండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version