Suryakumar Yadav React on His Fitness: తన బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, టీ20 ఫార్మాట్‌లో దూకుడు ఉండాల్సిందే అని ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఫిట్‌నెస్‌పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా అని, త్వరలోనే 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని సూర్య పేర్కొన్నాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఇటీవల ఆటకు దూరమైన సూర్య.. ఐపీఎల్ 17వ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లను సైతం ఆడలేదు. తాజాగా ఫిట్‌నెస్ సాధించిన మిస్టర్ 360.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.
ఐపీఎల్ 2024లో ఆడిన నాలుగు మ్యాచుల్లో సూర్యకుమార్ యాదవ్ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. కీలక పంజాబ్‌పై 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన ఫిట్‌నెస్‌పై స్పందించాడు. ‘ఫిట్‌నెస్‌పరంగా 100 శాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా. ఫీల్డింగ్ కోసం ట్రైనింగ్ కూడా మొదలెట్టా. త్వరలోనే బ్యాటింగ్, ఫీల్డింగ్ కలిపి 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తా. జీవితంలో ఆటుపోట్లు సహజం. అన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలి’ అని సూర్యకుమార్ తెలిపాడు.
Also Read: Jasprit Bumrah: బుమ్రాను భయపెట్టిన భారత యువ బ్యాటర్.. వీడియో వైరల్!
‘నా బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా.. వెనక్కి తగ్గను. టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడాల్సిందే. టీమ్ మేనేజ్‌మెంట్ నాకేమీ ప్రత్యేకంగా సూచనలు చేయదు. పంజాబ్ మ్యాచ్‌కు ముందు రోజు మీటింగ్ జరిగింది. టాప్ ఆర్డర్‌లో ఒక్కరైనా 17 ఓవర్ల వరకు క్రీజ్‌లో ఉండాలనుకున్నాం. పిచ్ కఠినంగా ఉందని నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాం. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే.. బౌలర్లకు తేలికవుతుంది. పంజాబ్‌పై ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించా. రోహిత్ శర్మ ఔటైన తర్వాత ఆ బాధ్యత నేను తీసుకున్నా. నా బ్యాటింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
