Phil Salt replaces Jason Roy at KKR: ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి వైదొలిగాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. మరోవైపు కేకేఆర్ కూడా ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వస్తున్నాడని ట్వీట్ చేసింది.
ఫిల్ సాల్ట్‌ను అతడి రిజర్వ్ ధర రూ.1.50 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి తీసుకుంది. సాల్ట్‌కు ఇది ఐపీఎల్‌లో రెండో సీజన్. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతడు ఆడాడు. 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన సాల్ట్ 218 పరుగులు చేశాడు. సాల్ట్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లండ్ తరఫున, లీగ్ క్రికెట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లండ్ తరఫున సాల్ట్ 19 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్‌లో కలిపి 1258 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ద సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో రెండు సెంచరీలు చేయడం విశేషం.
Also Read: WPL 2024: ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్!
2024కు సంబంధించి కేకేఆర్‌లో ఇది రెండో మార్పు. ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండటంతో అతను 17వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అట్కిన్సన్ స్థానంలో శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాను కేకేఆర్ తీసుకుంది. ఇక ఐపీఎల్ 2024 మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న చెన్నై, బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 23న కేకేఆర్ తన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.