Jasprit Bumrah To Join Mumbai Indians Ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే 17వ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ సైలెంట్‌గా ఉంది. ఫ్రాంచైజీలన్నీ తమ పూర్తి జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు, జెర్సీ ఆవిష్కరణలు చేస్తుంటే.. ముంబై మాత్రం ఏ హడావుడి చేయడం లేదు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా జట్టుతో కలవకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
మార్చి 21న అహ్మదాబాద్‌లో జస్ప్రీత్ బుమ్రా జట్టుతో కలుస్తాడని ముంబై ఇండియన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా ముంబైలోని తన ఇంటికె వెళ్లిన బుమ్రా.. విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముంబై తన తొలి మ్యాచ్ మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనున్న నేపథ్యంలో 21న బుమ్రా జట్టుతో కలవనున్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ఆడాడు కాబట్టి.. గుజరాత్ మ్యాచ్‌కు ముందు అతనికి మూడు రోజుల ప్రాక్టీస్ సరిపోతుందని ముంబై టీమ్స్ వర్గాలు తెలిపాయి. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ప్రకటించడాన్ని ముంబై జట్టులో మెజార్టీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందులో బుమ్రా కూడా ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే బుమ్రా ఆలస్యంగా జట్టులో చేరుతున్నాడట.
Also Read: Virat Kohli: మా ఇద్దరి మధ్య పోలిక సరికాదు.. విరాట్ కోహ్లీ ఎన్నో సాధించాడు: మంధాన
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 కోసం ఎప్పటినుంచో సన్నద్ధమవుతున్నాడు. మార్చి 12 నుంచి ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం అయింది. మార్చి 18న రోహిత్ శర్మ ముంబై జట్టుతో కలిశాడు. చీలమండ గాయంతో ఆటకు దూరమైన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆడడంపై క్లారిటీ లేదు. ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ విషయంలో సూర్యకు క్లియరెన్స్ రావాల్సి ఉంది. గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న సూర్య.. చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.