CSK Bowler Deepak Chahar React on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోకాలి గాయం నుంచి కోలుకున్నాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో 2-3 సీజన్‌లు ఆడగలడని చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై జట్టును ఊహించడం కష్టమే అని, సీఎస్‌కే అంటేనే మహీ భాయ్ అని పేర్కొన్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరం కలిసి పబ్‌జీ ఆడేవాళ్లమని టీమిండియా పేసర్ దీపక్ చహర్ తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ సిరీస్‌లకు చహర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2024 ఆడేందుకు సిద్దమవుతున్నాడు.
‘ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. మరో 2-3 ఐపీఎల్ సీజన్‌లు ఆడగలిగే సత్తా మహీలో ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. చివరి నిర్ణయం మాత్రం ధోనీదే. గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం నేను చూశాను. బాగా ఆడుతున్నాడు. తన చివరి మ్యాచ్ చెన్నైలోనే అని ధోనీ అందరికీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఊహించడం చాలా కష్టమే. సీఎస్‌కే అంటేనే మహీ భాయ్’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు.
‘ఎంఎస్ ధోనీకి క్లోజ్ అవ్వడానికి నాకు 2-3 ఏళ్లు పట్టింది. నేడు మహీని నా పెద్ద అన్నయ్యలా చూస్తాను. మా ఇద్దరి మధ్య సరదా క్షణాలు చాలా ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరం కలిసి పబ్‌జీ గేమ్ ఆడేవాళ్లం. మైదానం వెలుపల కూడా మహీ భాయ్‌తో చాలా సమయం గడిపాను. ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాను. అది నా అదృష్టం. కేవలం ధోనీ వల్లే నేను బీభరత జట్టుకు ఆడగలిగాను. ఐపీఎల్ 2018లో 14 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చాడు. మహీ భాయ్‌కి చాలా రుణపడి ఉన్నా’ అని దీపక్ చహర్ చెప్పుకొచ్చాడు.
Also Read: Indian Navy Rescues: 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించిన భారత నౌకాదళం!
ఎంఎస్ ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. గత 4 సంవత్సరాలుగా అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తూ అభిమానులను అలరించాడు. అయితే ప్రతి సీజన్‌కు ముందు మహీ ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారుతుంది. 2025 సంగతి పక్కన పెడితే.. 2024లో ధోనీ బరిలోకి దిగడం మాత్రం ఖాయం అయింది. ఇప్పటికే అతడు ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. గత ఐపీఎల్ సీజన్‌లో మోకాలి గాయం కారణంగా టోర్నీ ఆసాంతం ఇబ్బంది పడ్డ ధోనీ.. శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.