ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు.. కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చేస్తుందంటే.. గంటలు.. రోజుల తరబడి కూడా స్టోర్ల ముందు నిలబడి.. కొత్త ఫీచర్లతో వచ్చిన తాజా ఫోన్‌ను అందుకోవడానికి తహతహలాడిపోతారు ఐఫోన్ లవర్స.. సాధారణంగా కొత్త ఐఫోన్ సిరీస్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయి. అయితే, ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. iPhone 18 Pro, iPhone 18 Pro Max విడుదలైన తర్వాత iPhone 17కు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో మార్కెట్లో స్టాక్ కొరత ఏర్పడటంతో పాటు, పాత మోడల్ ధరలు కూడా పెరగడం చర్చనీయాంశంగా మారింది.
రాత్రికి రాత్రే రూ.17 వేల పెరుగుదల
ఇటీవల వరకు రూ.82,900కు అందుబాటులో ఉన్న iPhone 17 ధర Apple అధికారిక వెబ్‌సైట్‌లో ఒక్కసారిగా రూ.99,900కు చేరింది. అంటే పాత మోడల్ ధర ఏకంగా రూ.17,000 పెరిగింది. సాధారణంగా కొత్త మోడల్ విడుదలైనప్పుడు పాత ఐఫోన్ ధర తగ్గాల్సి ఉండగా, ఈసారి మాత్రం అందుకు విరుద్ధమైన పరిణామం చోటుచేసుకుంది. ధర పెరిగిన కొద్దిసేపటికే పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో iPhone 17 స్టాక్ ‘Sold Out’గా కనిపించింది. దీంతో అసలు మార్కెట్లో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది.
స్టోర్లలోనూ స్టాక్ కొరత
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రధాన స్టోర్లు, మొబైల్ మార్కెట్లలో iPhone 17 లభ్యతపై పరిశీలన జరిపినప్పుడు భిన్నమైన సమాధానాలు ఎదురయ్యాయి. ఘజియాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టీ-బ్రాండ్ స్టోర్‌లో iPhone 17 అందుబాటులో ఉందని తొలుత సేల్స్‌మ్యాన్ చెప్పాడు. అయితే కొత్త ధరకు మాత్రమే లభిస్తుందని స్పష్టం చేశాడు. తర్వాత స్టాక్ లేదని, అయితే కొత్త ధరకు అడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటున్నామని, ఐదు రోజుల తర్వాత డెలివరీ ఇస్తామని చెప్పాడు. పాత స్టాక్‌ను కంపెనీ వెనక్కి తీసుకుందని సేల్స్‌మ్యాన్ వెల్లడించాడు.
వారంటీ పేరుతో అదనపు భారం?
తూర్పు ఢిల్లీలోని మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో iPhone 17 కావాలంటే రూ.8,500 విలువైన ఏడాది పొడిగించిన వారంటీ తప్పనిసరిగా తీసుకోవాలని ఓ సేల్స్‌మ్యాన్ చెప్పాడు. అయితే స్టోర్ మేనేజర్ మాత్రం ఈ వాదనను ఖండించి, ఎక్స్‌టెండెడ్ వారంటీ తప్పనిసరి కాదని స్పష్టం చేశాడు. అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్లో iPhone 17ను కొందరు డీలర్లు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి.
బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణలు
స్టోర్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం, కొంతమంది పెద్ద డీలర్లు తమ సిబ్బందిని సాధారణ వినియోగదారులుగా పంపించి స్టాక్‌ను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అదే ఫోన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నిజమైన వినియోగదారులను గుర్తించేందుకు GST బిల్లుపై ఫోన్‌లను విక్రయిస్తున్నామని మేనేజర్ వెల్లడించారు. పాత ధరకు iPhone 17ను విక్రయిస్తున్న ఆ స్టోర్‌లో కూడా స్టాక్ త్వరగానే పూర్తయింది.
రూ.82,900 ఫోన్.. రూ.95 వేల వరకు విక్రయం?
తూర్పు ఢిల్లీలోని స్థానిక మొబైల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దుకాణాల్లో iPhone 17 దొరుకుతుందని చెబుతున్నప్పటికీ, స్టాక్ కోసం వినియోగదారులు గంటల తరబడి వెతకాల్సి వచ్చింది. క వినియోగదారుడి ప్రకారం, అధికారిక స్టాక్ లేదని దుకాణదారులు చెబుతున్నప్పటికీ నగదు చెల్లిస్తే రూ.82,900 విలువైన iPhone 17ను రూ.95,000 వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇది బ్లాక్ మార్కెటింగ్‌గా పేర్కొన్నాడు..
iPhone 18 కంటే iPhone 17కే డిమాండ్ ఎందుకు?
అయితే, iPhone 18 Pro సిరీస్ ధరలు ఎక్కువగా ఉండటం కూడా iPhone 17 డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొత్త సిరీస్‌లో కెమెరా, ప్రాసెసర్, AI వంటి విభాగాల్లో అప్‌గ్రేడ్‌లు ఉన్నప్పటికీ, వాటి ధరలు వినియోగదారులకు భారంగా మారాయి. దీంతో చాలా మంది కొనుగోలుదారులు iPhone 18 కంటే తక్కువ ధరలో లభించే iPhone 17నే మెరుగైన విలువ కలిగిన ఎంపికగా భావిస్తున్నారని రిటైలర్లు చెబుతున్నారు. ఈ డిమాండ్‌ను కొందరు డీలర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
iPhone 18 Pro ధర ఎంత?
Apple తాజాగా iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లను విడుదల చేసింది. భారత్‌లో iPhone 18 Pro ప్రారంభ ధర రూ.1,64,900 కాగా, iPhone 18 Pro Max ధర రూ.1,79,900గా ఉంది. ఈ రెండు మోడళ్లలో కెమెరా, ప్రాసెసర్, AI సామర్థ్యాల్లో పలు అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. Apple ప్రకారం, ఈ మోడళ్లకు సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
ఫోల్డబుల్ iPhone కూడా విడుదల
Apple తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. iPhone Duoగా పేర్కొన్న ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర రూ.2,99,900గా ఉంది. ఈ ధర కూడా కొంతమంది వినియోగదారులను ఖరీదైన కొత్త మోడల్‌కు బదులుగా iPhone 17 వైపు మళ్లిస్తున్నట్లు మార్కెట్ పరిస్థితులు సూచిస్తున్నాయి. మొత్తంగా, iPhone 18 విడుదల తర్వాత iPhone 17 ధరలు తగ్గాల్సిన సమయంలో పెరగడం, స్టాక్ కొరత ఏర్పడటం, కొన్ని మార్కెట్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడం ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఆసక్తికర పరిణామంగా మారింది.. కొన్ని రోజుల తర్వాత ఏమైనా పరిస్థితి మారుతుందా? అనేది వేచిచూడాల్సిన అంశం..

