Worm In Antibiotic Syrup: మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు సిరప్ కారణంగా 20 మంది పిల్లలు మరణించిన విషయం మరవక ముందే.. మరో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈసారి యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ సిరప్ (Azithromycin Oral Suspension Syrup)లో ఈ లోపం బయటపడింది. అందిన నివేదిక వివరాల ప్రకారం.. గ్వాలియర్ లోని మురార్ జిల్లా ఆసుపత్రిలో పిల్లలకు ఇచ్చిన యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు కనిపించాయి. ఈ ఘటన వెలుగులోకి రావడానికి కారణం ఒక తల్లి. తన బిడ్డకు సిరప్ ఇచ్చే ముందు సీసాను పరిశీలించిన ఆ తల్లికి, సిరప్‌లో ఏవో నల్లని పురుగు లాంటివి కనిపించాయి.
మురార్ మెటర్నిటీ హోమ్ ఆసుపత్రిలో ఓ పిల్లాడికి అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ సిరప్ ను సూచించారు. డ్రగ్ పంపిణీ కేంద్రం నుంచి సిరప్ తీసుకున్న ఆ తల్లి అందులో ఉన్న పురుగును చూసి వెంటనే ఆసుపత్రికి చేరుకుని సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్కే శర్మకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమై, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుభూతి శర్మ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపింది. దర్యాప్తు బృందం ఫార్మసీ నుంచి సిరప్ నమూనాలను సేకరించడంతో పాటు, అజిత్రోమైసిన్ సిరప్ పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సిరప్ పంపిణీ అయిన కేంద్రాల నుంచి దాన్ని వెనక్కి రప్పించే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే HONOR Robot Phone వేరే లెవెల్ అంతే.! వీడియో వైరల్..
దర్యాప్తులో భాగంగా ఈ విభాగం ఇతర పిల్లల మందులను కూడా పరిశీలించింది. ప్రాథమిక విచారణలో ఈ సిరప్ భోపాల్ లోని ప్రభుత్వ స్టోర్ నుంచి సరఫరా అయినట్లు వెల్లడైంది. ప్రస్తుతం బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఈ సిరప్ ఏయే జిల్లాలకు పంపబడిందో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ విషయంపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అనుభూతి శర్మ మాట్లాడుతూ.. సిరప్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు ధృవీకరించారు. ల్యాబ్ నివేదికలో ఏదైనా నాణ్యతా లోపం లేదా హానికరమైన పదార్థాలు ఉన్నట్లు తేలితే.. సంబంధిత కంపెనీ లేదా సరఫరాదారుపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ సిరప్‌ను పంపిణీ చేయవద్దని, ఉపయోగించవద్దని ఆ ప్రాంతంలోని ఆసుపత్రులను అధికారులు ఆదేశించారు.
