NTV Telugu Site icon

Ink Attack on Minister: అంబేడ్కర్‌, పూలేపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిపై సిరా దాడి

Ink Attack On Minister

Ink Attack On Minister

Ink Attack on Minister: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలేలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి చంద్రకాంత్ పాటిల్ శనివారం పుణె జిల్లాలోని పింప్రీ చించ్‌వాడ్ నగరంలో ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. మంత్రిపై దుండగుడు సిరా చల్లిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా మంత్రిని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ “విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పట్లో అంబేడ్కర్, పూలే ప్రభుత్వ నిధులను కోరలేదని, పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు ‘యాచించారు'” అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ‘యాచించడం’ అనే పదం వివాదాస్పదమైంది. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజలే నిధులు సమకూర్చుకోవాలని చెప్పడం మంత్రి ఉద్దేశమని వివరణ ఇచ్చారు. చంద్రకాంత్ పాటిల్ చెప్పిన దానిని అర్థం చేసుకోవాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

 

ఈ సంఘటన తర్వాత పాటిల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “కోర్సు పూర్తయిన తర్వాత దేవగిరి జిల్లాలోని పైఠాన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్లు పంపిణీ చేయడానికి వెళ్ళాను. వారు మరిన్ని నిధులు అడిగారు. ఇప్పటికే వారికి రూ.12 కోట్లు మంజూరు అయ్యాయి. ప్రభుత్వం నుండి రూ.23 కోట్లు మంజూరు చేయాలని అడగగా.. ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందని నేను చెప్పాను, అయితే మీరు ఇతర వనరుల నుండి నిధులు సేకరించడానికి ప్రయత్నించండి. మహారాష్ట్రలో పాఠశాలలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మా ఫూలే ప్రారంభించారని నేను చెప్పాను. నేను డాక్టర్ అంబేద్కర్, మహాత్మా ఫూలేలను ఎప్పుడు విమర్శించాను?” అంటూ వెల్లడించారు. అంబేద్కర్, ఫూలే విద్యాసంస్థలకు ప్రభుత్వ గ్రాంట్లు కావాలని కోరలేదని, పాఠశాలలు ప్రారంభించారని, మీరు కూడా అలాగే చేయాలని అన్నానని “నేనేం తప్పు చెప్పాను?” అంటు మంత్రి ప్రశ్నించారు. ఈ ఘటన తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని పాటిల్ అన్నారు. “నా ముఖం మీద సిరా చల్లడం వల్ల ఏమీ జరగదు. నాపై ప్రభావం చూపదు. నేను చొక్కా మార్చుకుని ముందుకు సాగాను” అని మంత్రి చెప్పారు.

Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్‌.. చెన్నైని వణికిస్తున్న వర్షాలు

నిరసన చేస్తున్నప్పుడు శాంతిభద్రతలను చేతిలోకి తీసుకోవద్దని మహారాష్ట్ర మంత్రి తన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. వారు నిరసన తెలియజేయాలనుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని కోరారు. పోలీసు సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వారిని సస్పెండ్ చేయవద్దని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కోరారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సిరా దాడిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ఖండించారు.

Show comments