Jobs: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్‌మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..

Infosys

Infosys

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత డిమాండ్ పరిస్థితుల మధ్య కూడా ప్రతిభావంతులను ఆకర్షించడంలో పెట్టుబడులను కొనసాగించింది. ఇందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ 20,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,25,000 మార్కును దాటింది.

కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో మేనేజ్‌మెంట్ మాట్లాడూతూ.. ఆర్థిక సంవత్సరం 2026 క్రమశిక్షణతో కూడిన అమలుతో సాగిందని, స్థిరమైన కరెన్సీ ఆదాయంలో 3.1 శాతం వృద్ధిని సాధించామని వెల్లడించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, టెక్నాలజీ సేవల కోసం క్లయింట్ల నుంచి ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ.. ఈ ఏడాది ఇన్ఫోసిస్ 14.9 బిలియన్ డాలర్ల విలువైన 96 భారీ ఒప్పందాలను సొంతం చేసుకుంది.

×
×
Ad

ప్రస్తుతం టెక్నాలజీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఒక పెద్ద మార్పును ఎదుర్కొంటోందని, గత ఆవిష్కరణల కంటే ఏఐ అత్యంత విప్లవాత్మకమైనదని మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఐటీ కంపెనీల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే ఆందోళనలను తోసిపుచ్చుతూ.. ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ఏఐ వల్ల ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. చాలా కంపెనీలు రెడీమేడ్ ఉత్పత్తుల కంటే తమకు నచ్చినట్లుగా కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లను రూపొందించుకోవడానికే ఇష్టపడతాయని, ఇది టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లకు మరిన్ని పెద్ద అవకాశాలను సృష్టిస్తుందని తెలిపింది.

ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఏఐ సంబంధిత వ్యాపారం ద్వారా ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. క్లయింట్లు తమ వ్యాపారాలను కేవలం ప్రయోగాల దశ నుంచి భారీ ఎత్తున విస్తరించేందుకు మొగ్గు చూపుతుండటంతో, రాబోయే రోజుల్లో ఏఐ సేవల ద్వారా వచ్చే ఆదాయం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఇన్ఫోసిస్ యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.