Site icon NTV Telugu

INDW vs NZW: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ ఘన విజయం!

Indw Vs Nzw

Indw Vs Nzw

న్యూజిలాండ్‌ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ రాధ యాదవ్‌ (3/35), అరంగేట్ర పేసర్‌ సైమా ఠాకోర్‌ (2/26) సత్తాచాటారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో వన్డే అహ్మదాబాద్‌లోనే ఆదివారం జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. తేజల్‌ హసబ్నిస్‌ (42; 64 బంతుల్లో 3×4), దీప్తి శర్మ (41; 51 బంతుల్లో 2×4, 1×6), యాస్తిక భాటియా (37; 43 బంతుల్లో 5×4), జెమీమా రోడ్రిగ్స్ (35; 36 బంతుల్లో 1×4), షెఫాలి వర్మ (33; 22 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. కెప్టెన్‌ స్మృతి మంధాన (5), దయాళన్ హేమలత (3) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్‌ (4/42), జెస్‌ కెర్‌ (3/49) కట్టడి చేశారు.

ఛేదనలో న్యూజిలాండ్‌కు ఆరంభం దక్కలేదు. ఓపెనర్ సుజీ బేట్స్ (1) త్వరగానే పెవిలియన్ చేరింది. ఈ సమయంలో జార్జియా ప్లిమ్మర్ (25), లారెన్ డౌన్ (26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దీప్తి శర్మ, రాధ యాదవ్‌లు వీరిని పెవిలియన్ చేర్చారు. సోఫీ డివైన్ (2) విఫలమైంది. బ్రూక్‌ హాలిడే (39), మ్యాడీ గ్రీన్‌ (31), అమేలియా కెర్‌ (25 నాటౌట్‌) పరుగులు చేసినా మిగతావారి నుంచి సహకారం లేకపోయింది. భారత బౌలర్లలో రాధ యాదవ్‌ (3/35), సైమా ఠాకోర్‌ (2/26) రాణించారు.

Exit mobile version