NTV Telugu Site icon

IND vs AUS: బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్‌ ఓటమి!

Australia Women

Australia Women

Australia Women won by 6 wkts vs India Women: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన భారత మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది. భారత్ నిర్ధేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆసీస్‌ మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మంగళవారం ముంబైలోనే జరుగుతుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులే చేసింది. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన షెఫాలి వర్మ (1), జెమీమా రోడ్రిగ్స్‌ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఆసీస్‌ పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీసి.. భారత్‌ను ఒత్తిడిలో నెట్టింది. ఈ సమయంలో ఈ స్థితిలో స్మృతి మంధాన (23) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైంది. కాసేపటికే హర్మన్‌ప్రీత్‌ కౌర్ (6) కూడా వెనుదిరగడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థితిలో దీప్తిశర్మ (30; 27 బంతుల్లో 5×4).. రిచా ఘోష్‌ (23; 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెట్టింది. రిచా ఔట్‌ అయ్యాక ఇన్నింగ్స్‌ వేగం తగ్గిపోయింది. దీప్తి క్రీజులో ధాటిగా ఆడలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావడంతో.. భారత్‌ 130 పరుగులు చేసింది. కిమ్‌ గార్త్‌ (2/27), జార్జియా వేర్‌హామ్‌ (2/17), అనాబెల్‌ సదర్లాండ్‌ (2/18) తలో రెండు వికెట్స్ తీశారు.

Also Read: IND vs AFG: కోహ్లీ, రోహిత్ వచ్చేశారు.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!

ఛేదనలో ఆస్ట్రేలియాపై ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఓపెనర్లు అలీసా హీలీ (26; 21 బంతుల్లో 4×4), బెత్‌ మూనీ (20) శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరిని దీప్తిశర్మ స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడంతో ఆసీస్‌ 9.1 ఓవర్లలో 58/2తో నిలిచింది. అయితే ఎలీస్‌ పెర్రీ (34 నాటౌట్‌; 21 బంతుల్లో 3×4, 2×6) దూకుడుగా ఆడి స్కోర్ వేగాన్ని పెంచింది. తాలియా (19), గార్డ్‌నర్‌ (7) స్వల్ప వ్యవధిలో ఔటైనా… లిచ్‌ఫీల్డ్‌ (18 నాటౌట్‌)తో కలిసి పెర్రీ పని పూర్తి చేసింది.