NTV Telugu Site icon

INDW vs AUSW: నేడే భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20.. తొలి సిరీస్‌ సాధించేనా!

Indw Vs Ausw

Indw Vs Ausw

INDW vs AUSW 3rd T20: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు టీ20లో చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ పోరులో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి ఆస్ట్రేలియాపై స్వదేశంలో సిరీస్‌ పట్టేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది. రెండో టీ20లో గెలిచి ఊపుమీదున్న ఆసీస్ కూడా సిరీస్ గెలవాలని చూస్తోంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

తొలి టీ20లో అద్భుత విజయం సాధించి జోరు మీద కనిపించిన భారత మహిళల జట్టు.. రెండో మ్యాచ్‌లో తడబడింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఈ రెండు విభాగాల్లో పుంజుకోవాల్సి ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ వైఫల్యం జట్టును వేధిస్తోంది. షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడ లేమి జట్టును కలవరపరిచే అంశమే. దీప్తిశర్మ వేగంగా ఆడలేకపోతోంది. బౌలింగ్‌లోనూ దీప్తి రాణిస్తున్నా.. మిగిలిన బౌలర్లు తేలిపోతున్నారు. సరైన సమయాల్లో వికెట్లు తీయకపోవడం భారత జట్టును ఇబ్బందిపెడుతోంది. రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్‌ రాణించాల్సిన అవసరం ఉంది.

Also Read: Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి!

మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఓడాక ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. టీ20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా.. రెండో మ్యాచ్‌లో చెలరేగింది. ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్‌ గెలుచుకోవాలని చూస్తోంది. ఎలీస్‌ పెర్రీ, లిచ్‌ ఫీల్డ్‌ల ఫామ్ ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. రెండో టీ20లో ఆసీస్‌ చెలరేగిన తీరు చూస్తే… ఆ జట్టును ఆపాలంటే భారత్ శక్తికి మించి రాణించాల్సిందే. రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Show comments