Site icon NTV Telugu

Indravelli Martyrs Day: నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం.. మొదటిసారి అధికారికంగా..!

Indravelli Martyrs Day 2025

Indravelli Martyrs Day 2025

ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి నేటితో 44 ఏళ్లు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధంను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం తొలిసారిగా అధికారికంగా జరగనుంది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు. ఈ సంస్మరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు.

1981 ఏప్రిల్‌ 20న సీపీఐకి చెందిన కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరిగిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని కాల్పులు జరిపారు. ఆదివాసీలకు భూమి సర్టిఫికెట్ల డిమాండ్, ఆదివాసీయేతర వ్యక్తుల ఆక్రమణలను నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. భూమి, భుక్తి, విముక్తి పేరుతో నాడు పోరు సభ జరిగింది. మొదట ఈ సభకు అనుమతి ఇచ్చినప్పటికీ.. నక్సలైట్ల ఆందోళన భయంతో దీనిని రద్దు చేశారు. ఆనాడు పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు మరణించారని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని ఆదివాసీలు అంటారు.

ఆనాడు మరణించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతీ ఈఏడాది ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లి మండలం హిరాపూర్‌లో ఆదివాసీలు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమంపై నిషేధం ఉండేది. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం సంస్మరణ కార్యక్రమంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసింది. దాంతో ఆదివాసీలు ఈరోజు అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినం చేస్తున్నారు. ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టుకుంటోంది.

Exit mobile version