Indrakeeladri Moola Nakshatram: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఆరవ రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనాల కోసం అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి కొండపైకి వెళ్లే మార్గం వరకు క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా భవానీ దీక్ష స్వీకరించిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.
మూలా నక్షత్రం కావడంతో ఈ రోజు ఇంద్రకీలాద్రికి సుమారు 2.5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ రోజు అన్ని వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్యూలైన్లలోనూ ఉచిత దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు సీఎం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో.. ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది.

