Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!

Indonesia

Indonesia

Indonesia: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ నౌకా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా 243 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ నౌక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. నౌకతో సంబంధాలు తెగిపోవడంతో అప్రమత్తమైన ఇండోనేషియా జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తక్షణమే భారీ స్థాయిలో సహాయక చర్యలను (రేస్క్యూ ఆపరేషన్) ప్రారంభించింది. సహాయక ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం.. అదృశ్యమైన ఆ నౌక పేరు ‘వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ (Cargo Transport 8 / Virgo Transport 8). ఈ నౌక శనివారం తూర్పు జావాలోని సురబాయ నగరం నుంచి బయలుదేరి దక్షిణ కాళిమంతన్‌లోని బంజర్మాసిన్ నగరానికి పయనమైంది.

అయితే, జావా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన బ్యాడ్ వెదర్ కారణంగా నౌకతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. ఈ ప్రకటన విడుదల చేసే సమయానికి కూడా నౌకతో ఎలాంటి సంబంధాలు పునరుద్ధరణ కాలేదని, దాని ఖచ్చితమైన సమాచారం లేదా ఉనికి ఇంకా లభించలేదని ఏజెన్సీ వెల్లడించింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు వేగంగా రంగంలోకి దిగాయి. నౌకకు సంబంధించి చివరిగా లభించిన లొకేషన్ ఆధారంగా సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లను ఆ దిశగా పంపించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 17,000 వేల ద్వీపాలు ఉన్న ఇండోనేషియాలో ప్రజలకు సముద్ర నౌకలే అత్యంత ప్రధానమైన రవాణా సాధనం. విమాన ప్రయాణంతో పోలిస్తే చౌకగా లభించడం, సులభంగా అందుబాటులో ఉండటంతో సామాన్య ప్రజలు ఎక్కువగా ఈ ఫెర్రీలపైనే ఆధారపడుతుంటారు. అయితే, దేశంలో నౌకల నిర్వహణ, సముద్ర రవాణా భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్ల అక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.