Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..

Stock Market

Stock Market

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు కూడా భారీ లాభాలలో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,718 పాయింట్లు పెరిగి 81,028 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 493 పాయింట్ల లాభంతో 25,030 వద్ద లాభపడింది. భారతీయ షేర్ మార్కెట్లు వరుసగా ఏడవ రోజూ లాభాల పరంపరను కొనసాగించడం గమనార్హం. ఈ భారీ ర్యాలీకి అంతర్జాతీయ, దేశీయ సానుకూల సంకేతాలు ప్రధాన కారణమయ్యాయి.

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో భారీగా కొనుగోళ్లు చేయడం, ఆసియా, అమెరికా మార్కెట్ల నుంచి లభించిన మద్దతు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, మెటల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు విపరీతంగా పెరగడం మార్కెట్ సూచీలను ముందుకు నడిపించింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 1,300 పాయింట్లకు పైగా లాభపడింది.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం, చౌకగా లభిస్తున్న షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడం మార్కెట్ కు కలిసివచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే బుల్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది .సెషన్ ముగిసే సమయానికి సూచీలు తమ కీలక స్థాయిలను అధిగమించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా భారీ లాభాలను నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల సంపద గణనీయంగా పెరిగింది. మూలధన ప్రవాహం స్థిరంగా ఉండటంతో దలాల్ స్ట్రీట్‌లో పండుగ వాతావరణం నెలకొంది.