Indian Railways: భారతీయ రైల్వే తన ధృవీకరించబడిన (Confirmed) టిక్కెట్ల రద్దు నిబంధనలను సవరించి, సరికొత్త రీఫండ్ విధానాన్ని ప్రకటించింది. రైలు బయలుదేరడానికి మిగిలి ఉన్న సమయం ఆధారంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకుంటే, నిర్ణీత రద్దు రుసుము మినహాయించి గరిష్ట వాపసు పొందుతారు. అయితే, 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే కనీస రుసుముతో పాటు టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలు చేయనుంది.
READ ALSO: Praja Darbar: మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ!
టికెట్ రద్దు చేసే సమయం దగ్గరపడే కొద్దీ జరిమానా భారం మరింత పెరుగుతుందని ఈ ప్రకటనలో అధికారులు వెల్లడించారు. రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 8 గంటల ముందు రద్దు టికెట్స్ క్యాన్సల్ చేస్తే, ప్రయాణ రుసుములో 50% కోత విధించబడుతుంది. మరీ ముఖ్యంగా, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే, ప్రయాణికులకు ఎటువంటి రీఫండ్ లభించదు. గతంలో రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు వరకు స్థిరమైన ఛార్జీలు (రూ.240 + GST లేదా రూ.180 + GST) ఉండగా, తాజా మార్పులతో సమయ పరిమితులు మరింత కఠినతరమయ్యాయి. మరోవైపు, ప్రయాణికులకు ఊరటనిచ్చేలా బోర్డింగ్ పాయింట్ మార్పుపై రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు వారు ఎక్కే స్టేషన్‌ను మార్చుకోవచ్చు. బహుళ స్టేషన్లు ఉన్న నగరాల్లోని ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని చెబుతున్నారు. దళారులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసి, ఆపై రద్దు చేయడం వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంతో పోలిస్తే టికెట్ నిర్ధారణ కోసం వచ్చే అభ్యర్థనలు గణనీయంగా తగ్గాయని, ఈ కొత్త నిబంధనలు వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తాయని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవండి!
