NTV Telugu Site icon

Divyangjan Rail Card: దివ్యాంగులకు భారత రైల్వే శుభవార్త

Divayang

Divayang

Divyangjan Rail Card: రైల్వేపాసుల కోసం ఇకపై దివ్యాంగులు రైల్వే కార్యాలయాలు, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇందుకోసం భారత రైల్వేశాఖ కొత్తగా ఆన్‌లైన్‌ పాస్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటి నుంచే పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా http://divyangjanid.indianrail.gov.in అనే వెబ్‌సైట్‌ ప్రారంభించారు. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించడంతోపాటు ఛార్జీల్లోనూ రాయితీ ఉంటుంది. ఇప్పటివరకు ఈ పాస్‌లు పొందాలంటే రైల్వే స్టేషన్లు లేదా డివిజన్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. చాలామందికి ఇది కష్టసాధ్యమయ్యేది. మరీ ముఖ్యంగా పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు పెద్ద స్టేషన్లకు పలుమార్లు వెళ్లాల్సి వచ్చేది. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేషన్లలో మాత్రమే పాస్‌లు జారీ చేస్తుండటం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. కానీ, ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొత్త పాస్‌లు పొందవచ్చు లేదా పాత పాస్‌లు పునరుద్ధరించుకోవచ్చు. దీని ద్వారా OTP ఆధారిత లాగిన్‌ చేసి, ఫామ్ పరిస్థితిని ఎప్పుడైనా పరిశీలించవచ్చు.

Also Read: Masthan Sai : మస్తాన్ సాయి- లావణ్య కేసులో వెలుగులోకి మరో ఆడియో

ఇక రైల్వేపాస్ దరఖాస్తు విధానం గురించి చూస్తే.. http://divyangjanid.indianrail.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి.. పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ వంటి వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి దరఖాస్తు పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డు కూడా మంజూరు చేస్తారు. రాజకీయాలు, ప్రభుత్వ ప్రక్రియల కారణంగా ఎన్నో నెలలు పాస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దివ్యాంగులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. రైల్వే అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే, ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ అందుబాటులోకి రావడంతో వారు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా పాస్‌ను పొందే అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి ముందు రైల్వేశాఖలో అనేక కేటగిరీలకు పాస్ సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే కోవిడ్ ప్రభావంతో రైళ్లు నిలిపివేయడంతో పాసుల జారీ నిలిపివేశారు. ఆ తర్వాత కేవలం కొన్ని కేటగిరీలకు మాత్రమే పాస్‌లను పునరుద్ధరించారు. దివ్యాంగులతో పాటు వారికి తోడుగా వెళ్లేవారికి కూడా పాస్‌లో సగం ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో వారి జీవితాలు సులభతరంగా మారనున్నాయి.