NTV Telugu Site icon

Indian Railways: గుడ్ న్యూస్.. పరిహారాన్ని పది రెట్లు పెంచిన రైల్వే బోర్డు

Indian Railways

Indian Railways

Indian Railways increases it’s Compensation to 10 times: సాధారణంగా రైలు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినా, ప్రాణాలు కోల్పోయిన రైల్వే బోర్డు వారికి పరిహారం చెల్లిస్తూ ఉంటుంది. ఈ పరిహారాన్ని గతంలో 2013లో పెంచారు. తాజాగా వీటిపై నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ పరిహారాలను పది రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి  రైల్వే బోర్డు సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కొత్త నిబంధనలు తక్షణం  అమల్లోకి వస్తాయని పేర్కొంది రైల్వే బోర్డు. రైలు ప్రమాదాలతో పాటు కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలకు పెంచిన పరిహారం వర్తిస్తుంది. అయితే కాపలాదారుల్లేని లెవెల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు, రైల్వే నిబంధనలను అతిక్రమించినవారికి, రైలు మార్గాల ఎలక్ట్రిక్ వ్యవస్థ  (ఓహెచ్‌ఈ) వల్ల విద్యుత్ షాక్ కు గురైనవారికి ఎక్స్‌గ్రేషియా వర్తంచదని రైల్వే బోర్డు వెల్లడించింది.

Also Read: Today Gold Price: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ఎంతుందంటే?

ఇప్పటి వరకు ఉన్న పరిహారం.. ఇక నుంచి ఇవ్వబోతున్న పరిహారాలను ఓసారి పరిశీలిస్తే రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రస్తుతం  రూ.50 వేలు పరిహారం ఇస్తున్నారు. దానిని పదింతలు పెంచితే ఇక నుంచి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి ఇచ్చే పరిహారాన్ని ప్రస్తుతం ఉన్న రూ.25 వేల నుంచి 2.5 లక్షలకు పెంచారు. స్వల్పంగా గాయపడినప్పుడు ఇచ్చే పరిహారాన్ని రూ.5 వేల నుంచి రూ.50 వేల చేశారు. ఇక రైలు ప్రయాణాలలో అప్పుడప్పుడు అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటివి వీటి కిందకి వస్తాయి. ఈ  సందర్భాల్లో ఇచ్చే పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా ప్రస్తుతం రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇక వీటితో పాటు రైలు ప్రమాదాల బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారు.  తీవ్రంగా గాయపడినవారు 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే రోజుకు రూ.3,000 వంతున ప్రతీ 10 రోజులకోసారి అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. అవాంఛిత ఘటనల్లోనైతే ఈ మొత్తం రూ.1,500గా ఉంటుంది. ఇలా ఆరు నెలలవరకు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు రూ.750 చొప్పున గరిష్ఠంగా మరో అయిదు నెలలపాటు చెల్లిస్తారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి కేవలం రైల్వే బోర్డు నిబంధనలు పాటించిన వారికి మాత్రమే వర్తిస్తాయి.