సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది, ఇందులో డ్రోన్ సహాయంతో రైలును శుభ్రం చేయడం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు రైల్వే శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సరికొత్త చర్చకు దారితీశాయి. ఒక డ్రోన్ చాలా నైపుణ్యంతో రైలు వెలుపలి కిటికీలు, ఉపరితలంపై నీరు, సబ్బును చిలకరిస్తూ శుభ్రం చేయడం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది.
సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉన్న ఈ అత్యాధునిక విధానానికి సంబంధించిన వీడియోను బీజేపీ ఢిల్లీ విభాగం తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకుంది. రక్షణ, రవాణా, రైల్వే ఇలా భారతదేశం ప్రతి రంగంలోనూ సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని, రైల్వేను స్వచ్ఛంగా, ఆధునికంగా మార్చడంలో ఇదొక సానుకూల అడుగు అని వారు పేర్కొన్నారు. ఈ వీడియో ఖచ్చితమైన లొకేషన్ ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, రైలు డిజైన్, పరిసరాలను బట్టి ఇది ఘాజియాబాద్ రైల్వే స్టేషన్ లేదా దాని పరిసర ప్రాంతాలకు చెందినదిగా భావిస్తున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. భారత్ నిజంగానే ప్రపంచ స్థాయి సాంకేతికతను అవలంబిస్తోందని, ఇది చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. డ్రోన్ల ద్వారా క్లీనింగ్ చేయడం అనేది భవిష్యత్తు అని, దీనివల్ల స్వచ్ఛ భారత్ అభియాన్‌కు సరికొత్త ఊపు లభించిందని, మరికొందరు దీనిని ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ విజయంగా అభివర్ణిస్తున్నారు. అలాగే ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద స్టేషన్లలో, హై-స్పీడ్ రైళ్లలో కూడా అమలు చేయాలని రైల్వే శాఖను కోరుతున్నారు.
మరోవైపు.. రైళ్ల శుభ్రతలో డ్రోన్ల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానవ కార్మికులకు ప్రమాదకరంగా ఉండే ఎత్తైన కిటికీలు, చేరుకోలేని కఠినమైన ప్రాంతాలను డ్రోన్ల ద్వారా సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. గతంలో కూడా రైల్వే బోర్డు స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లు, కోచ్‌ల శుభ్రతలో డ్రోన్ సాంకేతికతను పరీక్షించింది. ఇటీవలి కాలంలో రైల్వే శాఖ ఏఐ ఆధారిత నిఘా, సోలార్ ప్యానెళ్లు, ఆటోమేటిక్ క్లీనింగ్ మిషన్ల వాడకాన్ని పెంచింది. ఈ వైరల్ వీడియో కూడా రైల్వేను మరింత ఆధునీకరించే ప్రక్రియలో భాగమేనని భావిస్తున్నారు.

