పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ కు పతకాల పంట పండుతుంది. 4వ తేదీన (బుధవారం) భారత పారాథ్లెట్ సచిన్ సర్జేరావు ఖిలారీ సంచలనం సృష్టించాడు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్46)లో సచిన్ రజత పతకం సాధించాడు. సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది 21వ పతకం. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సచిన్ సర్జేరావ్ ఖిలారీ తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్లు విసిరాడు. ఈ ఈవెంట్‌లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టీవర్ట్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. స్టీవర్ట్ అత్యుత్తమ త్రో 16.38 మీటర్లు. కాగా, క్రొయేషియాకు చెందిన బకోవిచ్ లుకా (16.27 మీటర్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
READ MORE: Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
కాగా.. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగనున్న 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పారాలింపిక్స్‌లో 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ హవా కొనసాగుతోంది. నేటివరకు 21 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఈ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో కూడా భారత్ అత్యధిక పతకాలను గెలుచుకుంది. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో సహా 19 పతకాలను భారత్ ఖాతాలో వేసుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు 21 మెడల్స్ గెలిచి.. గత రికార్డును బ్రేక్ చేశారు.