Site icon NTV Telugu

America: అమెరికాలో మరో భారతీయుడు హత్య

America Murder

America Murder

అమెరికాలో (America) వరుసగా భారతీయులు హత్యకు గురికావడం కలవరం రేపుతోంది. ఇటీవలే పలువురు దారుణహత్యకు గురయ్యారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. వాషిం‍‍‍గ్టన్‌లోని ఓ హోటల్‌ బయట రోడ్డుపై జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత సంతతికి (Indian) చెందిన వివేక్‌ తనేజా(41) (Vivek Taneja) అనే వ్యక్తి వర్జీనియాలో నివాసముంటున్నాడు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌లోని (Washington Street) ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. దుండగుడు వివేక్‌ తలపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్‌ ప్రాణాలు కోల్పోయాడు.

సీసీకెమెరాలో రికార్డైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలియజేసే వారికి పోలీసులు రివార్డ్ కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఐదుగురు భారతీయులు మరణించారు. తాజాగా మరొకరు చనిపోవడంతో ఎన్నారైల్లో కలవరం రేగుతోంది.

 

Exit mobile version