Ireland Prime Minister : భారతీయ సంతతికి చెందిన లియో వరాడ్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా శనివారం రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్ గేల్ పార్టీకి చెందిన వరాద్కర్ మరోసారి ఎన్నికయ్యారు. 2017లో తొలిసారి ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఐర్లాండ్‌లో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అధికారం పంచుకుంటున్నాయి. కూటమిలో ముందే కుదిరిన ఒప్పందం మేరకు ఇంతకాలం ప్రధానిగా ఉన్న మైకెల్ మార్టిన్ రాజీనామా చేసి లియో వరాడ్కర్‌కు బాధ్యతలు అప్పగించారు. వరాడ్కర్ తండ్రి వైద్యుడు. భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. నర్సుగా పనిచేశారు. లియో వరాడ్కర్ ఐర్లాండ్‌లోనే జన్మించారు. వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
Read Also: Javelin In Student Neck: స్కూల్లో స్పోర్ట్స్ ఆడుతుండగా విద్యార్థి మెడలోకి దూసుకెళ్లిన జావెలిన్
రెండోసారి అవకాశం లభించిన క్రమంలో డబ్లిన్‌లోని ఐర్లాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు లియో వరాద్కర్. ‘ మన పౌరులందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలను అందించాలనే కాంక్షతో వినయంగా, సంకల్పంతో ఈ నియామకాన్ని అంగీకరిస్తున్నా. ఐర్లాండ్ ప్రధానిగా అవకాశం రావటం జీవతకాల పురస్కారం. గత వందేళ్లలో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తా. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తాను. కరోనా వ్యాప్తి సమయంలో సహకారం అందించిన మైఖేల్ మార్టిన్‌కు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు వరాద్కర్. మొదటిసారి ప్రధాని అయినప్పుడు లియో వయసు కేవలం 38 ఏండ్లు. ఐర్లాండ్ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాను స్వలింగ సంపర్కుడినని లియో 2015లో బహిరంగంగా ప్రకటించారు.