NTV Telugu Site icon

PR Sreejesh: హాకీ కిట్ కొనడానికి ఆవును అమ్మిన శ్రీజేశ్‌ తండ్రి.. ఆ రోజు ఏం చెప్పాడంటే?

Pr Sreejesh Cow

Pr Sreejesh Cow

Indian Goalkeeper PR Sreejesh Retirement: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరోసారి అద్భుతం చేసింది. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్.. కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. స్పెయిన్‌పై గెలిచి పతకం గెలవడమే కాదు.. భారత హాకీకి పెట్టని కోట గోడగా పేరొందిన పరట్టు రవీంద్రన్‌ శ్రీజేశ్‌ (పీఆర్‌ శ్రీజేశ్‌)కు ఘనమైన వీడ్కోలు పలికారు. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడేసిన గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ది భారత విజయాల్లో కీలకపాత్ర. అయితే శ్రీజేష్ కోసం అతని తండ్రి పీవీ రవీంద్రన్ చాలా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో కొడుక్కి హాకీ కిట్ కొనిపెట్టడానికి ఏకంగా వారి ఇంట్లో ఆవును కూడా అమ్మేశారు.

1998లో 12 ఏళ్ల వయసులో హాకీ నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌లో పీఆర్‌ శ్రీజేశ్‌ చేరారు. ఆ స్కూల్‌ హాకీ కోచ్‌.. శ్రీజేష్‌ను గోల్‌ కీపింగ్‌ నేర్చుకొమ్మని సలహా ఇచ్చారు. కోచ్‌ చెప్పిన విషయాన్ని శ్రీజేష్‌ తన తండ్రికి చెప్పారు. కొడుకు కలను సాకారం చేసేందుకు పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేశారు. కిట్ ఖరీదు ఖరీదు 10 వేలు కాగా.. తన వద్ద 3 వేలు మాత్రమే ఉండడంతో రవీంద్రన్ ఆవును అమ్మక తప్పలేదు. అయితే ఆ సమయంలో రవీంద్రన్‌ తన కొడుకు శ్రీజేష్‌కు ఓ మాట చెప్పారు. ‘ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని అమ్మేశా. నువ్వు అనుకున్న కలను సాధించాలి. హాకీలో గోల్‌ కీపర్‌గా మెరవాలి. దేశానికి పతకం తేవాలి’ అని చెప్పారు. తండ్రి మాటలను శ్రీజేష్‌ రెండుసార్లు నెరవేర్చారు.

Also Read: Gold Price Today: భారీగా పడిపోయాయి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు! హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే

2004లో జాతీయ జూనియర్‌ జట్టులోకి వచ్చిన శ్రీజేశ్‌.. 2008లో సీనియర్‌ జట్టులో చోటు సంపాదించారు. నమ్మదగిన గోల్‌కీపర్‌గా మారడంతో 2011 నుంచి సీనియర్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా కొనసాగారు. 328 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత చారిత్రక విజయాల్లో శ్రీజేశ్‌ది కీలక పాత్ర. 2014 ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌తో స్వర్ణ పతక మ్యాచ్‌లో రెండు పెనాల్టీ స్ట్రోక్స్‌ను అడ్డుకున్నారు. 2016లో సర్దార్‌సింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని.. ఆ ఏడాది రియో ఒలింపిక్స్‌లో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ వెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. టోక్యోలో భారత్ కాంస్యం గెలవడంలో శ్రీజేశ్‌ గోల్‌ కీపింగ్‌ అత్యంత కీలకంగా మారింది. పారిస్‌లోనూ అడ్డుగోడగా మారి ఎన్నోసార్లు ప్రత్యర్థి గోల్‌ ప్రయత్నాలను వమ్ము చేశారు. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో ఆఖరి నిమిషంలో రెండుసార్లు గోల్‌ను అడ్డుకుని ఘనంగా కెరీర్‌ను ముగించారు. శ్రీజేశ్‌ ఖాతాలో రెండు ఒలింపిక్‌ పతకాలతో పాటు రెండు ఆసియా క్రీడల స్వర్ణాలు, రెండు కామన్వెల్త్‌ రజతాలు, రెండు ఛాంపియన్స్‌ ట్రోఫీ రజతాలు ఉన్నాయి.