NTV Telugu Site icon

MS Dhoni: సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్‌లో అద్భుత దృశ్యం.. సునీల్ గవాస్కర్ చొక్కాపై ధోనీ ఆటోగ్రాఫ్

Sunil Gavaskar

Sunil Gavaskar

MS Dhoni: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే, కేకేఆర్‌ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ సీఎస్కే కెప్టెన్‌ ధోనీని ఆటోగ్రాఫ్‌ అడగడం ఆసక్తి కలిగించింది. ఈ అద్బుతం సీఎస్‌కే, కేకేఆర్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగింది. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ధోనీ సేనకు ఇది చివరి మ్యాచ్‌ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్‌ కామెంటేటర్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ పరుగున మైదానంలోకి వచ్చాడు. ధోనీ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని కోరాడు. అదీ తాను వేసుకున్న చొక్కాపై ఇవ్వాలని కోరాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన ధోనీ.. సునీల్ గవాస్కర్ ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అతను వేసుకున్న చొక్కాపై తన సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అనంతరం ట్విట్టర్‌ వేదిక స్పందించిన గవాస్కర్‌ మిగిలిన మ్యాచ్‌లకు దయచేసి తనకు కొత్త పింక్‌ షర్ట్‌ ఇవ్వండి.. అంటూ రాసుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. అంతకముందు కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ కూడా ధోని ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచే ధోని ఆట చూస్తూ పెరిగిన రింకూ సింగ్‌.. ఇవాళ తన అభిమాన ఆటగాడికి ప్రత్యర్థిగా ఆడడమే గాక ఫిఫ్టీతో మెరిసి కేకేఆర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం తన అభిమాన ఆటగాడిని కలుసుకున్న రింకూ సింగ్‌ ధోనితో ముచ్చటించాడు. ధోని ఇచ్చిన విలువైన సలహాలను శ్రద్దగా విన్నాడు. అనంతరం తన జెర్సీపై ధోని ఆటోగ్రాఫ్‌ను పెట్టించుకున్నాడు. ఎంఎస్ ధోనీకిదే చివరి సీజన్‌ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీఎస్‌కే హోంగ్రౌండ్‌ వేదికగా ఆఖరి మ్యాచ్‌ ఆడటంతో అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 15 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢిల్లీ వేదికగా మే 20న చెన్నై ఆడనుంది. దీంతో ఇరు జట్లకూ లీగ్‌ స్టేజ్‌ పోరు ముగుస్తుంది.

Read Also: Imran Khan: నన్ను పదేళ్లపాటు జైల్లో ఉంచాలని పాక్ సైన్యం ప్లాన్ చేస్తోంది..

ఈ సీజన్‌లో చెపాక్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో నెగ్గి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలనుకున్న ధోనీ సేనపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (48 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), కాన్వే (30) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (57 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), రింకూ సింగ్‌ (54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. కేకేఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ లభించింది.