Site icon NTV Telugu

US Politics: అగ్రరాజ్యంలో భారతీయ-అమెరికన్ల విజయకేతనం..

Us Politics

Us Politics

US Politics: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ-అమెరికన్లు విజయకేతనం ఎగరవేశారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీకి చెందిన భారత సంతతికి ముస్లిం వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ (34) చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఓడించి అమెరికాలోని అత్యంత సంపన్న నగరంలో నయా చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరం అయిన న్యూయార్క్‌కు ముస్లిం మేయర్‌గా కూడా ఆయన రికార్డు సృష్టించారు.

READ ALSO: AP News: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు.. పరారైన డాక్యుమెంట్ రైటర్లు!

జోహ్రాన్ మమ్దానీకి 948,202 ఓట్లు (50.6 శాతం) పోలయ్యాయి. ఆయన చాలా నెలలుగా NYC మేయర్ ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు. ఆండ్రూ కుయోమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికలకు ముందు రోజు ట్రంప్ ఆమోదం పొందారు. అయినప్పటికీ ఆయనపై మమ్దానీ సులభంగా గెలిచారు. ఈ ఎన్నిక క్యూమోకు 776,547 ఓట్లు (41.3 శాతం) రాగా, స్లివాకు 137,030 ఓట్లు వచ్చాయి. 1969 తర్వాత తొలిసారిగా రెండు మిలియన్ల ఓట్లు పోలైనట్లు న్యూయార్క్ నగర ఎన్నికల బోర్డు ప్రకటించింది. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ 444,439 ఓట్లతో ఆధిక్యంలో ఉంది, ఆ తర్వాత బ్రాంక్స్ (187,399), బ్రూక్లిన్ (571,857), క్వీన్స్ (421,176), స్టేటెన్ ఐలాండ్ (123,827)లు ఉన్నాయి.

జోహ్రాన్ మమ్దానీ ఎవరు ?
ఉగాండాలోని కంపాలాలో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ ఏడేళ్ల వయసులో న్యూయార్క్ నగరానికి వెళ్లి తరువాత అమెరికా పౌరసత్వం పొందారు. ఆయన తల్లి మీరా నాయర్ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ చిత్రనిర్మాత, తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. మమ్దానీ సిరియన్-అమెరికన్ కళాకారిణి రామా దువాజీని వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకొని, అదే సంవత్సరం ఫిబ్రవరిలో లోయర్ మాన్‌హట్టన్‌లోని సిటీ క్లర్క్ కోర్ట్‌హౌస్‌లో వివాహం చేసుకుంది.

విజయం సాధించిన భారతీయ – అమెరికన్ గజాలా హష్మీ ..
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ డెమొక్రాట్ గజాలా హష్మీ విజయం సాధించారు. రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా అమెరికన్ హష్మీ. ఆమె15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆశ్చర్యకరమైన విజయంతో గజాలా హష్మీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానాన్ని ఆమె గెలుచుకొని వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదు సంవత్సరాల తరువాత 2024లో ఆమె సెనేట్ విద్య, ఆరోగ్య కమిటీకి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

జెండాను ఎగురవేసిన జెజె సింగ్..
భారతీయ-అమెరికన్ అయిన జెజె సింగ్ వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్ డిస్ట్రిక్ట్ 26 నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ జిల్లా ప్రధానంగా ఉత్తర వర్జీనియాలో ఉంది. జెజె సింగ్ ఉత్తర వర్జీనియాలోని పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆయన ఫెయిర్‌ఫాక్స్ స్టేషన్‌లో పెరిగార. ఆయన తల్లిదండ్రులు 1970లో భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఆయన తండ్రి అమర్ జీత్ సింగ్ బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు పాకిస్థాన్)లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారతదేశంలోని హర్యానాలో స్థిరపడ్డారు. అనంతర కాలంలో ఆయన తన కుటుంబంతో కలిసి ఉత్తర వర్జీనియాకు వలస వెళ్లారు.

READ ALSO: Paytm – Groq Partnership: గ్రోక్‌తో పేటీఎం ఒప్పందం.. డిజిటల్ పేమెంట్స్‌లో విప్లవాత్మక ముందడుగు

Exit mobile version