NTV Telugu Site icon

IND Vs SL: తొలి టీ20 టీమిండియాదే.. వరుసగా పదో విజయం

స్వదేశంలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌పై వరుసగా వన్డేలు, టీ20ల సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను కూడా విజయంతోనే ప్రారంభించింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివరకు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

కాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌‌తో టీమిండియా వరుసగా పది టీ20 మ్యాచ్‌ల్లో గెలిచింది. టీ20 మ్యాచ్‌ల విషయంలో ఇలా వరుసగా 10 మ్యాచ్‌లు గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి. అలాగే భారత్ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు(89) చేసిన వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ వికెట్ కీపర్ ఇన్ని పరుగులు చేయలేదు.