Site icon NTV Telugu

India vs Australia: ఆసీస్ గడ్డపై గర్జించిన భారత మహిళలు.. పదేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్!

India Women

India Women

India Women Clinch T20 Series in Australia: ఆస్ట్రేలియా గడ్డపై భారత లేడీ సింగాలు గర్జించారు. కంగారూ సొంత గడ్డలో ఆ టీమ్‌ను 17 పరుగుల తేడాతో ఓడించారు. ఆస్ట్రేలియా గడ్డపై రెండోసారి టీ20 సిరీస్‌ గెలిచింది భారత మహిళల జట్టు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంతకుముందు 2016లో తొలిసారి ఈ ఘనత సాధించిన ఉమెన్స్ టీమ్, తాజాగా మళ్ళీ చరిత్రను పునరావృతం చేసింది. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యతాయుతంగా ఆడి కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు స్కోర్ చేసి జట్టును నిలబెట్టింది. 149.09 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి ఆ తర్వాత గేర్ మార్చింది మంధాన.. మెంబర్స్ స్టాండ్‌లోకి కొట్టిన ఓ భారీ సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. పేసర్ డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. తన 160వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆమెకు ఇది 33వ అర్ధశతకం.

READ MORE: Hyderabad: జ్వరం అని వెళ్తే ప్రాణాలు తీశారు! వైద్యం వికటించి 6 నెలల శిశువు మృతి

ఓపెనర్ షఫాలీ వర్మ (7) త్వరగానే అవుటైనప్పటికీ, జెమీమా రోడ్రిగ్స్‌తో (46 బంతుల్లో 4 ఫోర్లతో 59 పరుగులు) కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి రెండో వికెట్‌కు ఏకంగా 121 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. కేవలం 66 బంతుల్లోనే వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించి చివర్లో భారీ స్కోరుకు బాటలు వేశారు. జెమీమా ఎంతో సంయమనంతో ఆడగా, మంధాన తన క్లాస్ షాట్లతో అలరించింది. అయితే చివర్లో ఈ ఇద్దరూ అన్నాబెల్ సదర్లాండ్ (2/34) బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యూహాత్మకంగా రిచా ఘోష్‌ను నాలుగో స్థానంలో పంపగా.. ఆమె ఆ నమ్మకాన్ని నిలబెడుతూ కేవలం 7 బంతుల్లోనే వేగంగా 18 పరుగులు చేసి జట్టు స్కోరును 175 దాటించింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఏ దశలోనూ కుదురుకున్నట్లు కనిపించలేదు. ఆష్లీ గార్డనర్ (45 బంతుల్లో 57 పరుగులు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ జట్టు 159/9 స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు ఆతిథ్య జట్టు తలవంచింది. లెగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అద్భుత స్పెల్‌తో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, అరంగేట్రం చేసిన శ్రీ చరణి 32 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. అరుంధతి రెడ్డి కూడా 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటర్ల మధ్య పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాకుండా అడ్డుకుంది. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత మహిళల జట్టు రికార్డును పునరావృతం చేసింది.

READ MORE: Abhishek Sharma: “నా స్టైలే ఇంత.. మైండ్‌సెట్ మార్చుకోను!” హ్యాట్రిక్ డకౌట్‌లపై అభిషేక్ శర్మ షాకింగ్ రియాక్షన్..

Exit mobile version