How India Won the Asia Cup by Winning Only 2 Matches: ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. యూఏఈ వేదికగా మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆసియా కప్ కోసం భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20న ప్రకటించే అవకాశముంది. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో భారత్ జట్టులో ఎవరుంటారా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతేకంటే ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత్ 2 మ్యాచ్‌లే గెలిచి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
మొదటిసారి ఆసియా కప్ జరిగినప్పుడు కేవలం మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కప్ మొదటి ఎడిషన్ 1984లో ఏప్రిల్ 6 నుండి 13 వరకు యూఏఈలోని షార్జాలో జరిగింది. ఆ ఎడిషన్‌లో భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 1983లో ప్రపంచకప్‌ను అందించిన కపిల్ దేవ్ లేకుండానే భారత జట్టు 1984 ఆసియా కప్ ఆడింది. లెజెండ్ సునీల్ గవాస్కర్ నాయకత్వంలో అద్భుతంగా ఆడి టైటిల్‌ను గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో జహీర్ అబ్బాస్ పాకిస్తాన్‌కు, దిలీప్ మెండిస్ శ్రీలంకకు నాయకత్వం వహించారు.
1984 ఆసియా కప్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 6న జరిగింది. ఇందులో పాకిస్తాన్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్ణీత 46 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రాయ్ డయాస్ (57 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో శ్రీలంక మరో 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఏప్రిల్ 8న శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది. చేతన్ శర్మ (3 వికెట్లు), మదన్ లాల్ (3 వికెట్లు), మనోజ్ ప్రభాకర్ (2 వికెట్లు) రాణించడంతో శ్రీలంక కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. సురీందర్ ఖన్నా (51 నాటౌట్), గులాం పార్కర్ (32 నాటౌట్) లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు.
Also Read: Jogulamba Gadwal: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకు ప్రచారం!
1984 ఆసియా కప్‌లో మూడవ, చివరి మ్యాచ్ ఏప్రిల్ 13న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 46 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సురీందర్ ఖన్నా 56 పరుగులు చేశాడు. సందీప్ పాటిల్ (43), కెప్టెన్ సునీల్ గవాస్కర్ (36) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయి 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రవిశాస్త్రి, రోజర్ బిన్నీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ టైటిల్ గెలుచుకుంది. 1984 ఆసియా కప్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే జరగగా.. భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసి టైటిల్ అందుకుంది. టోర్నీలో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక ఒక మ్యాచ్ గెలిచింది. పాకిస్తాన్ ఖాతా కూడా తెరవలేకపోయింది.
ఆసియా కప్ తొలి ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా వెనక్కి తిరిగి చూడలేదు. భారత్ ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. 1984,1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023లలో ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు ఆసియా కప్ టైటిల్‌ను సాధించాయి.ఈసారి కూడా భారత్ టైటిల్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
