NTV Telugu Site icon

Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Yogi

Yogi

సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షరియా చట్టం (ముస్లిం) తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడం, ప్రజల సంపద వారికే తిరిగి పంచేయడం వంటివి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Gilli Re- Release : కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ “గిల్లి” మూవీ..

షరియా చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ అంటోందని.. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చిపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. తాలిబన్ పాలనను అమలు చేయాలనుకుంటున్నారని యోగీ పేర్కొన్నారు. వేర్వేరు కమ్యూనిటీలకు వేర్వేరు చట్టాలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ మాట్లాడుతోందని, దాని అర్థం దేశంలో షరియా చట్టం అమలు చేస్తామని స్పష్టంగా చెప్పడం కాదా? అని నిలదీశారు.

త్రిపుల్ తలాఖ్‌ను మోడీ సర్కార్ రద్దు చేయడంతో షరియా చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందని యోగి ఆక్షేపించారు. వ్యక్తిగత చట్టాలను తిరిగి తెస్తామని కాంగ్రెస్ చెబుతుండటం వెనుక వారి ఉద్దేశం చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2006లో చేసిన వ్యాఖ్యలను కూడా యోగి ప్రస్తావిస్తూ, దేశ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందని అప్పట్లో మన్మోహన్ సింగ్ చెప్పారని, మరి దళితులు, వెనుకబడిన తరగతులు, పేదలు, రైతుల మాటేమిటి? మన తల్లులు, సోదరీమణులు ఎక్కడకు వెళ్లాలి? మన యువకులు ఏమై పోవాలి? అని యోగి ఆదిత్యనాథ్ వరుస ప్రశ్నలు సంధించారు.

ఇది కూడా చదవండి: Canada: “1984 సిక్కు మారణహోమానికి” అధికార గుర్తింపు కోరిన సిక్కు ఎంపీ..

ఇప్పటికే రాజస్థాన్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ గెలిస్తే ఆస్తులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ మోడీ వ్యాఖ్యానించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. తాజాగా యోగీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

https://twitter.com/ANI/status/1782729085325840818