India Wholesale Inflation: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా కుదేలు చేస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు తాజా ద్రవ్యోల్బణం గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో టోకు ద్రవ్యోల్బణం (WPI) నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అక్టోబర్ నెలలో ఏకంగా 12.3%గా నమోదవ్వడం, వరుసగా రెండో నెల కూడా రెండంకెల స్థాయిలోనే కొనసాగడం ఆర్థిక వర్గాలను కలవరపెడుతోంది. టోకు ధరల పెరుగుదల ప్రభావం క్రమంగా రిటైల్ మార్కెట్‌పై పడితే, రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింత భగ్గుమనే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాదితో పోలిస్తే నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరగడంతో మెజారిటీ కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడింది. ఈ పరిస్థితులను తట్టుకునేందుకు చాలా కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నాయి. దిగువ మధ్యతరగతి (బిలో మిడిల్ క్లాస్) ప్రజలు బయట హోటళ్లలో తినడం పూర్తిగా మానేయగా, మధ్యతరగతి కుటుంబాలు షాపింగ్, వినోద ఖర్చులకు కత్తెర వేస్తున్నాయి. అంతేకాకుండా, సగానికి పైగా కుటుంబాలు నిత్యావసర వస్తువులను చాలా పరిమితంగా కొనుగోలు చేస్తున్నాయి. చాలా మంది పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ప్రోటీన్ ఆహార పదార్థాల వాడకాన్ని తగ్గించుకోగా.. పండ్లు, కూరగాయల కొనుగోళ్లపైనా నియంత్రణ పెట్టుకుంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు వాడే వారంతా ఇప్పుడు తక్కువ ధరకు లభించే సాధారణ బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంటి ఖర్చులు గడవక కొందరు తమ పొదుపు సొమ్మును వాడుకుంటుంటే, మరికొందరు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
ద్రవ్యోల్బణం ఇంతలా పెరగడానికి ప్రధానంగా ఇంధనం, విద్యుత్, తయారీ రంగాల్లో ధరల పెరుగుదలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 26 నుంచి ఏకంగా 33 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది; ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 57.3 శాతం నుంచి 70.8 శాతానికి చేరుకుంది. మరోవైపు, మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలోనూ ద్రవ్యోల్బణం 9.5 శాతంగా నమోదైంది. వస్త్రాలు, రసాయనాలు, రబ్బర్ ఉత్పత్తులు, లోహాలు, విద్యుత్ పరికరాల ధరలు పెరగడం ఇందుకు దారితీసింది. ఉత్పత్తి వ్యయం (ప్రొడక్షన్ కాస్ట్) విపరీతంగా పెరగడంతో కంపెనీలు ఆ భారాన్ని ఎంతో కాలం భరించలేవని, ఫలితంగా రానున్న నెలల్లో తయారీ ఉత్పత్తుల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) 6.09 శాతానికి చేరగా, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 8.94 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 6 శాతం గరిష్ట పరిమితిని రిటైల్ ద్రవ్యోల్బణం దాటేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అందరి దృష్టి డిసెంబర్లో జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC) పైనే నిలిచింది.

