WTC Final: భారత్ ఫైనల్ చేరడానికి ఇదొక్కటే మార్గం.. ఇలా చేయకపోతే ఇంటికే..

Test Cricekt

Test Cricekt

భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగమైన ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ 48.15 గెలుపు శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ విజయం చాలా అవసరం. ప్రస్తుత చక్రంలో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 4 ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. ఇంకా భారత్‌కు 9 టెస్టులు మిగిలి ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భారత జట్టును మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా హెచ్చరించారు. ఒకవేళ భారత్ శ్రీలంకను 2-0తో ఓడిస్తే గెలుపు శాతం 57.58కి పెరుగుతుందని, సిరీస్ 1-1తో సమమైతే పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. అదే శ్రీలంక చేతిలో భారత్ 0-2తో వైట్‌వాష్ అయితే గెలుపు శాతం 39కి పడిపోయి భారత్ మరింత వెనుకబడుతుందని స్పష్టం చేశారు.

శ్రీలంక సిరీస్ తర్వాత భారత్ న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆపై స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. మిగిలిన 9 టెస్టుల్లోనూ విజయం సాధిస్తే భారత్ గెలుపు శాతం 74.07కి చేరి సులువుగా ఫైనల్ చేరుతుందని, కనీసం 8 మ్యాచ్‌లు గెలిచినా రేసులో ఉంటుందని ఆయన విశ్లేషించారు.

అటు 14 టెస్టులు మిగిలి ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం 87.50 శాతంతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, భారత్‌లతో రాబోయే కఠినమైన సిరీస్‌ల వల్ల వారి గెలుపు శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. కాబట్టి మిగిలిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే భారత్ WTC ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోగలదని చోప్రా అభిప్రాయపడ్డారు.