Site icon NTV Telugu

India vs Ban: భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. చేయి కలపని కెప్టెన్లు!

Ind Ban

Ind Ban

India vs Ban: జింబాబ్వేలోని బులేవాయో వేదికగా ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్ల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజుల్ హకీం తమీమ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇద్దరు కెప్టెన్లు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. కానీ, ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జవాద్ అబ్రార్ పక్కపక్కనే నిలబడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఎలాంటి షేక్ హ్యాండ్ లేకుండానే అబ్రార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఉన్న కోపం, ఆవేశం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి. ఈ కోపం అక్కడితో ఆగలేదు. జాతీయ గీతం ఆలపించే సమయంలోనూ.. ఆ తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వెళ్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. బౌండరీ లైన్ దగ్గర ఇరు జట్ల ఆటగాళ్లు కలుసుకున్నప్పటికీ, ఎవరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. కనీసం మాటామంతీ కూడా కలపలేదు. భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. క్రీడా ప్రపంచంలో ఇలాంటి ప్రవర్తన చాలా అరుదుగా కనిపిస్తుంది.

READ MORE: రూ.10 వేల కంటే తక్కువ ధరకు iQOO Z10.. 256GB స్టోరేజీ, 50MP AI ప్రైమరీ కెమెరా

Exit mobile version