NTV Telugu Site icon

Ind vs Aus: నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20.. విశాఖ వేదికగా మ్యాచ్

Aus Vs Ind

Aus Vs Ind

T20 Match in Visakha: ప్రపంచకప్‌2023 ముగిసిన వెంటనే.. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు విశాఖపట్నం వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగబోతుంది. ఇప్పటికే వైజాగ్ కు భారత, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు చేరుకుని నెట్‌ ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నారు. రాత్రి 7 నుంచి 11 గంటల వరకు జరిగే డే అండ్ నైట్ మ్యాచ్‌కు సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకుల మధ్య జరగబోతుంది. స్టేడియం సామర్థ్యం.. సుమారు 28 వేల మంది కాగా.. 30కి పైగా గేట్ల ద్వారా ప్రేక్షకులను లోపలికి అనుమతించే ఛాన్స్ ఉంది. మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి సమస్యలు జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లతో పాటు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు.

Read Also: Revanth Reddy: నేడు కరీంనరగ్‌, సిద్దిపేటలో రేవంత్‌ పర్యటన..

అయితే, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు మొత్తం 11 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడబోతున్నాయి. ఈ సిరీస్‌ మ్యాచ్‌లు కూడా అందులో భాగమే కాబట్టి రెండు టీమ్‌లూ తుది జట్టు కూర్పులపై నజర్ పెట్టాయి. ఇక, జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్ గా ఉన్నారు. ఈ సిరీస్‌ కోసం కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి బాధ్యతలు చేపట్టగా.. ఇషాన్‌ కిషన్, ప్రసిధ్‌ కృష్ణ జట్టులో ఉన్నారు. ఇక, ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ సత్తా చాటేందుకు రెడీగా.. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఎవరిని పక్కన పెడతారనేది వేచి చూడాలి. అయితే, మిడిలార్డర్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌ లతో పటిష్టంగా కనిపిస్తుంది. లాస్ట్ మినిట్ లో గాయంతో వరల్డ్ కప్ కు దూరమైన అక్షర్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నాడు. రవి బిష్ణోయ్‌ రూపంలో లెగ్‌స్పిన్నర్‌ టీమ్ కు అందుబాటులో ఉన్నాడు.

Read Also: Odisha: ఒడిశాలో దారుణం.. సిట్ అప్‎లు చేయించిన టీచర్.. చనిపోయిన చిన్నారి

ఇక, పాట్ కమిన్స్, వార్నర్‌ లాంటి స్టార్లకు ఆస్ట్రేలియా రెస్ట్ ఇస్తూ.. ఈ సిరీస్‌ నుంచి తప్పించింది. ప్రస్తుతం కంగారుల జట్టు కూడా బలంగానే ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్న ఏడుగురు ఈ సిరీస్‌ కోసం భారత్‌లోనే ఉండిపోయారు. ఫైనల్‌ మ్యాచ్ ఆడిన స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే ఛాన్స్ ఉండగా.. ట్రవిస్‌ హెడ్, మ్యాక్స్‌వెల్, ఆడమ్‌ జంపా రెస్ట్ తీసుకోనున్నారు. స్మిత్‌ ఓపెనింగ్‌ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. టిమ్‌ డేవిడ్, స్టొయినిస్‌ జట్టులోకి వస్తున్నాడు. అటు, బౌలింగ్‌లో బెహ్రాన్‌ డార్‌ఫ్ కు భారత గడ్డపై కొంత అనుభవం ఉంది. ఆసీస్ నుంచి తన్విర్‌ సంఘా ఏకైక స్పిన్నర్‌ ఆడబోతున్నాడు.

Read Also: Koti Deepotsavam Day 9 Highlights: కోటి దీపోత్సవం.. 9వ రోజు హైలైట్స్‌..

అలాగే, విశాఖలో 2 వేల మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతతో పాటు స్టేడియం లోపల, వెలుపలా పటిష్ట నిఘా పెట్టారు. జన సామర్థ్యం అధికంగా ఉండే చోట్లా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. స్టేడియంలోకి బయటి నుంచి తీసుకువచ్చే తినుబండరాలు, వాటర్‌ బాటిల్స్‌కు పర్మిషన్ లేదన్నారు. ఇక, స్టేడియం మొత్తం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని.. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా, పరిధి దాటి ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకున్నా, సెల్ఫీలు తీసుకోవటానికి ట్రై చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. మ్యాచ్‌ నిర్వహణ సందర్భంగా వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించినట్లు విశాఖ పోలీసులు చెప్పారు.

Read Also: Pawan Kalyan: మెదక్‌ లో పవన్‌ పర్యటన.. చేగుంటలో రోడ్ షో

ఇరు జట్లు (అంచనా)
టీమిండియా: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌ (కెప్టెన్ ), స్టీవ్ స్మిత్, షార్ట్, హార్డీ, ఇంగ్లిస్, స్టొయినిస్, టీమ్‌ డేవిడ్, సీన్‌ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్‌ఫ్, తన్విర్‌ సంఘా.