Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..

Under 19

Under 19

ఒమన్ రాజధాని మస్కట్‌లో నవంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్ కోసం జూనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌తో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఈ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. వికెట్ కీపర్లుగా అన్వయ్ ద్రవిడ్, రజత్ బఘేల్ ఎంపికయ్యారు. అలాగే వి.కె. వినీత్, కుషాగ్ర ఓఝా, అర్జున్ రాజ్‌పుత్, మణాల్ చౌహాన్, వి. యష్‌వీర్, ఆర్యన్ సావసాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షవిన్ వినోద్, ఇషాన్ సూద్‌లకు జట్టులో చోటు లభించింది.

ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఎ లో నిలిచింది. ఈ గ్రూప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్‌తో పాటు యూఏఈ, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-బి లో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, మలేషియా జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్ దశలో భారత్ తన తొలి మ్యాచ్‌లో నవంబర్ 6న నేపాల్‌తో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 8న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో , నవంబర్ 10న యూఏఈతో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ మస్కట్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జరుగుతాయి.

రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్ 12న జరిగే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. విజేతను నిర్ణయించే ఫైనల్ పోరు నవంబర్ 14న శనివారం నిర్వహించనున్నారు. యువ భారత క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ టోర్నీ మంచి వేదిక కానుంది. ద్రవిడ్, సెహ్వాగ్ ల వారసులు ఆసియా కప్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనే దానిపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.