Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ బౌలర్..

Bcci

Bcci

న్యూజిలాండ్ టూర్ కోసం భారత క్రికెట్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా సీనియర్ టీ20 జట్టుతో పాటు, న్యూజిలాండ్ ‘ఏ’ జట్టుతో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడేందుకు ‘ఏ’ జట్టును కూడా బీసీసీఐ వెల్లడించింది. ఈ ప్రకటనలో అత్యంత కీలక పరిణామం ఏమిటంటే.. సుదీర్ఘకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. నవంబర్ 2022లో న్యూజిలాండ్ గడ్డపైనే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 36 ఏళ్ల భువనేశ్వర్, ఇప్పుడు మళ్లీ అదే దేశంలో జరిగే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. పవర్‌ప్లే ఓవర్లలో బంతిని స్వింగ్ చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న భువనేశ్వర్ రాక భారత వైట్-బాల్ బౌలింగ్ విభాగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఈ 40 రోజుల పర్యటన అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 22న క్రైస్ట్‌‌చర్చ్‌లో టీ20 సిరీస్‌తో ఈ టూర్ మొదలై, నవంబర్ 4 నుంచి వన్డేలు, నవంబర్ 19 నుంచి టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి ఈ మ్యాచ్‌లు చాలా కీలకం కానున్నాయి.

ఈ పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నారు.

మరోవైపు అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ‘ఏ’ టీమ్ మ్యాచ్‌ల కోసం ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, రిషబ్ పంత్ తదితరులు ఉన్నారు. వన్డే, టెస్ట్ జట్లను త్వరలోనే ప్రకటించనున్నారు.