India-US Tariffs: అమెరికా విధించిన 25% సుంకాలపై పార్లమెంటులో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ భారత్ తదుపరి చర్యలను వివరించారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని, రాబోయే కాలంలో అభివృద్ధి చెందిన దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రారంభిస్తుందని గోయల్ సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన వాదనలను ఖండించారు.
READ MORE: Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలి.. హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
“దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. 2047 కల్లా “వికసిత్ భారత్” (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధన కోసం సముచిత నిర్ణయాలు తీసుకుంటాం. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఇప్పటికే చేసుకున్నాం. మరిన్ని దేశాలతో వాణిజ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు, వాణిజ్య వ్యాపార సంస్థల ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా నిర్ణయాల వల్ల కలిగే లాభనష్టాలను, ప్రభావాలను అధ్యయనం చేస్తున్నాం. ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎగుమతిదారులు, పరిశ్రమలు, ఇతర వాటాదారుల ఆందోళనలను అర్థం చేసుకోవడానికి వారిని సంప్రదిస్తున్నాం. అమెరికా నిర్ణయాలకు స్పందించేది లేదు.. మౌనమే సమాధానం. ఏమి మాట్లాడాలో చర్చల సందర్భంగానే మాట్లాడతాం. భారత్ స్వయం సమృద్ధితో కూడిన ఆర్థిక శక్తి. రైతులు, కార్మికులు, వ్యవస్థాపకులు, MSMEలు, పారిశ్రామిక వాటాదారుల జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ” అని పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. భారతదేశం, అమెరికా ఇప్పటివరకు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. ఇటీవలి రౌండ్ చర్చలు ఈ నెల ప్రారంభంలో వాషింగ్టన్‌లో ముగిశాయి. తదుపరి చర్చల కోసం అమెరికా నుంచి ఒక బృందం ఆగస్టు 25న భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది.