Site icon NTV Telugu

Su-57 Fighter Jet India: సాహో భారత్.. ఇండియాలో రష్యా Su-57 యుద్ధ విమానాల తయారీ..

India Russia Defence Ties

India Russia Defence Ties

Su-57 Fighter Jet India: ప్రపంచ దేశాల్లో భారత్-రష్యా స్నేహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రెండు దేశాల్లో ఏ దేశానికి ఆపద వచ్చినా సాయం చేయడానికి మరొక దేశం ముందుకు వస్తుంది. తాజాగా భారతదేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశంతో రష్యా తన రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. “భారతదేశం AMCA ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా భారతదేశంలో ఐదవ తరం యుద్ధ విమానం Su-57 ఉత్పత్తి చేయనున్నాం. ఇది భారతదేశానికి చాలా మంచి విషయం” అని ఆయన పేర్కొన్నారు.

READ ALSO: Bengaluru: వాష్‌రూంలో సీనియర్‌ విద్యార్థినిపై రేప్.. ‘‘పిల్ కావాలా.?’’ అంటూ..

రష్యా -భారత్ మధ్య దీర్ఘకాల స్నేహం..
భారతదేశం – రష్యా రెండు దేశాలు 60 ఏళ్లపైగా రక్షణ మిత్రులుగా ఉన్నాయి. రష్యా భారతదేశానికి అనేక ఆయుధాలు, విమానాలను అందించింది. ఉదాహరణకు… ఇండియాకు స్వతంత్రం సిద్ధించిన రోజుల్లో భారత వైమానిక దళానికి వెన్నెముక అయిన మిగ్-21 విమానం రష్యా అందజేసిందే. అలాగే నేటికీ ఉపయోగంలో ఉన్న Su-30MKI యుద్ధ విమానాలు కూడా మాస్కో అందజేసిందే. బ్రహ్మోస్ క్షిపణిని రష్యా – భారతదేశంతో కలిసి అభివృద్ధి చేసిన ఉమ్మడి ప్రాజెక్ట్. 2024లో Su-30 అప్‌గ్రేడ్ కిట్‌లను మాస్కో భారత్‌కు డెలివరీ చేసింది. రష్యా ఎల్లప్పుడూ భారతదేశానికి మద్దతు ఇచ్చింది. భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ వంటి దేశాలతో కూడా భాగస్వామ్యం ఉంది, కానీ రష్యాతో ఉన్న భాగస్వామ్యం ప్రత్యేకమైనది.

AMCA ప్రాజెక్ట్ ఏంటి..
AMCA అంటే అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది భారతదేశం స్వదేశీగా అభివృద్ధి చేసిన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. స్టెల్త్ అంటే అది రాడార్‌లో కనిపించదు, అదృశ్య శక్తిగా పని చేస్తుంది. ఈ ప్రాజెక్టును హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఇతర భారతీయ కంపెనీలు నేతృత్వం వహిస్తున్నాయి. చైనా J-20, పాకిస్థాన్ నుంచి వచ్చే కొత్త విమానాలను ఎదుర్కోవడానికి భారతదేశ వైమానిక దళాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 2025 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంజిన్, స్టెల్త్ కోటింగ్ వంటి కొన్ని సాంకేతికతలు కష్టంగా మారాయి. ఇక్కడే రష్యా సహాయం చాలా కీలకం అవుతుంది.

Su-57 విమానం అంటే ఏమిటి?
Su-57 రష్యాలో అత్యంత అధునాతన ఐదవ తరం యుద్ధ విమానం. దీనిని ఫెలాన్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా వేగంగా, బహుళ ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇది ఏకకాలంలో దాడి, రక్షణ, నిఘా విధులను నిర్వహించగలదు. రష్యా ఎగుమతి వెర్షన్ Su-57E, ఇది భారతదేశం కోసం ప్రత్యేకమైనదిగా రష్యా అధికారులు పేర్కొన్నారు. దీనిని భారత్ దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే తయారు చేయనున్నారు.

టెక్నాలజీ బదిలీ: రష్యా స్టెల్త్ కోటింగ్, సూపర్ క్రూయిజ్ ఇంజిన్లు (ఆఫ్టర్‌బర్నర్ లేకుండా హై-స్పీడ్ ఫ్లైట్), అధునాతన ఎలక్ట్రానిక్స్‌లను అందిస్తుంది. ఇవన్నీ AMCA కి చాలా కీలకమైనవి.
భారతదేశంలో ఉద్యోగాల సృష్టి : HAL, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ & టూబ్రో వంటి కంపెనీలు సంయుక్తంగా వీటిని తయారు చేస్తాయి. దీంతో దేశంలో వేలాది ఉద్యోగాలు రానున్నాయి.

AMCA కి వారధిగా: Su-57 అనేది AMCA కి వారధిగా పనిచేస్తుంది. ముందుగా Su-57ను నేర్చుకోవడం ద్వారా, భారతదేశం AMCA ని వేగంగా పూర్తి చేయగలుగుతుంది.

ప్రాంతీయ భద్రత: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ వైమానిక శక్తి పెరుగుతుంది. చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పులను సమర్థంగా ఎదుర్కోగలదు.

ఎందుకు ముఖ్యమైనదంటే?
భారతదేశం ఇప్పుడు విదేశీ ఆయుధాలపై ఆధారపడటం తగ్గిస్తుంది. ఆయుధాలను భారత్ స్వయంగా తయారు చేయడమే కాకుండా వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రష్యా తాజా నిర్ణయం దానికి కూడా ప్రయోజనంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రష్యా ఆంక్షల సమస్యను ఎదుర్కొంటోంది. భారతదేశంతో ఒప్పందం దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం ఐదవ తరం టెక్నాలజీలో భారతదేశం పురోగతిని ముందుకు తీసుకెళ్తుందని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో ఆరవ తరం ప్రాజెక్టులను కూడా కొనసాగించవచ్చని పేర్కొన్నారు. డెనిస్ అలిపోవ్ ప్రకటన భారతదేశం-రష్యా స్నేహంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని వెల్లడించారు.

READ ALSO: H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడికి షాక్.. కొలంబియా కోర్టులో కొత్త H-1B వీసా రుసుముపై దావా

Exit mobile version