India-EU Trade Deal: చారిత్రాత్మక భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఈ ఒప్పందం కోసమే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్,యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా భారత పర్యటనలో ఉన్నారు. వీరిద్దరిని భారత 77వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. మంగళవారం, ప్రధాని మోడీతో ఈయూ చీఫ్ ఉర్సులా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ట్రేడ్ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు భారీగా తగ్గించాలని భారత్ యోచిస్తోంది. ఈయూ తయారీ కార్లై 110 శాతం నుంచి 40 శాతానికి సుంకాలను తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోని విస్తారమైన మార్కెట్‌ను ఈయూకు తెరిచే ప్రక్రియలో ఇది కీలకం కానుంది. 27 దేశాల కూటమి అయిన ఈయూ నుంచి 15,000 యూరోలు (రూ. 16.3 లక్షల) దిగుమతి ధర కలిగిన పరిమిత సంఖ్యలో కార్లపై పన్నును వెంటనే తగ్గించడానికి ప్రధాని మోడీ సర్కార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సంవత్సరానికి సుమారు 200,000 డిజిల్- పెట్రోల్ కార్లపై దిగుమతి సుంకాలను తక్షణమే 40%కి తగ్గించాలని న్యూఢిల్లీ ప్రతిపాదించిందని సోర్సెస్ చెబుతున్నాయి. ఈ సుంకాలను కాలక్రమేణా 10 శాతానికి తగ్గిస్తారు.
ఈ నిర్ణయంతో ఈయూ మార్కెట్ నుంచి వచ్చే వోక్స్ వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రసిద్ధ కంపెనీలకు భారత మార్కెట్లోకి ప్రవేశం మరింత సులువుకానుంది. ప్రస్తుతానికి చర్చల విషయాలు గోప్యంగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో మార్చులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ, యూరోపియన్ కమిషన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.
భారత్-ఈయూ మధ్య ట్రేడ్ డీల్‌ను ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా ఈయూ చీఫ్ ఉర్సులా అభివర్ణించారు. మంగళవారం స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కోసం సుదీర్ఘ చర్చలకు ముగింపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించగలదు. ఆగస్టు నుంచి 50 శాతం అమెరికా సుంకాలతో దెబ్బతిన్న భారత వస్త పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమలు యూరప్ దేశాలకు తమ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది.
తక్కువ దిగుమతి పన్నులు వోక్స్వ్యాగన్, రెనాల్ట్ , స్టెల్లాంటిస్ వంటి యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులకు, అలాగే భారతదేశంలో స్థానికంగా కార్లను తయారు చేస్తున్నప్పటికీ, అధిక సుంకాల కారణంగా ఒక స్థాయికి మించి వృద్ధి చెందడానికి ఇబ్బంది పడుతున్న మెర్సిడెస్-బెంజ్ మరియు బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ సంస్థలకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. యూరోపియన్ కార్‌మేకర్స్ భారత్‌లో ప్రస్తుతం 4 శాతం కన్నా తక్కువ వాటాను కలిగి ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత కార్ మార్కెట్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ ఏడాదికి 4.4 మిలియన్ కార్ యూనిట్ల మార్కెట్, దీనిలో మారుతి సుజుకీ, మహీంద్రా, టాటాలలు కలిసి మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. 2030 నాటికి భారత్ మార్కెట్ ఏడాదికి 6 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా.
