Site icon NTV Telugu

Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో కాశ్మీర్‌లో ఏమైంది.. ఆపరేషన్ జిబ్రాల్టర్‌తో పాక్‌‌కు ఏంటి సంబంధం?

Operation Gibraltar

Operation Gibraltar

Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో ఏం జరిగింది.. బ్రిటిష్ ఏలుబడిలో భారతదేశం – పాకిస్థాన్ ఒకప్పుడు రెండు కలిసి ఉండేవి. కానీ 1947 విభజన తర్వాత, రెండు దేశాలు విడిపోయి కాశ్మీర్ విషయంలో కత్తులు దూసుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సెప్టెంబర్ 6, 1965లో ఇండియా-పాక్ మధ్య మొదటిసారిగా పెద్ద ఘర్షణ జరిగింది. ఈ యుద్ధం 17 రోజుల పాటు కొనసాగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది.. యుద్ధానికి దారి తీసిన కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Honeymoon Murder Case: సోనమ్‌కు మరణశిక్ష విధించాలి..రాజా రఘువంశీ కుటుంబం..

‘ఆపరేషన్ జిబ్రాల్టర్’..
ఈ యుద్ధం పాకిస్థాన్ ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ రహస్య ప్రణాళిక కారణంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో అస్థిరతను సృష్టించడం, స్థానిక ప్రజలను భారత పాలనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం కోసం పాకిస్థాన్ వేలాది మంది సైనికులను కాశ్మీర్‌కు పంపించింది. ఈ సైనికులు భారత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభిస్తారని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారని పాకిస్థాన్ భావించింది. కానీ దీనికి ఇండియా దీటుగా ప్రతిస్పందించి లాహోర్‌పై దాడి చేయడంతో పాక్‌ను సప్రైజ్ చేసింది. ఆ సమయంలో భారత సైన్యం లాహోర్ శివార్లకు చేరుకోవడంతో పాక్ కూసాలు కదిలి పోయాయి.

సెప్టెంబర్ 6, 1965 ప్రత్యేకత..
జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్‌ను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ గ్రాండ్ స్లామ్‌ను ప్రారంభించింది. పాక్ ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలకు ఈ వివాదం పరాకాష్టగా మారింది. ఈ ఆపరేషన్ కింద 1965 ఆగస్టులో భారత సర్కార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టడానికి సాయుధ చొరబాటుదారులను పాక్ కాశ్మీర్‌లోకి పంపింది. దీనిపై భారతదేశం తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం త్వరలోనే పూర్తి స్థాయి యుద్ధంగా మారింది.

భారత సైన్యం లాహోర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద ట్యాంక్ యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్‌తో సహా అనేక ప్రాంతాలలో భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండు దేశాల పదాతిదళం, సాయుధ దళాలు, వైమానిక దళాలను మోహరించాయి. అసల్ ఉత్తర్, ఖేమకరణ్, సియాల్‌కోట్‌లలో ప్రధాన యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం 17 రోజుల పాటు కొనసాగింది. ఇది రెండు దేశాల మధ్య జరిగిన అత్యంత భీకర యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. ఈ యుద్ధంలో ఇరు దేశాలు విజయం సాధించాయని ప్రకటించాయి. కానీ రెండు వైపులా భారీ నష్టం చవిచూశాయి. కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలనే పాకిస్థాన్ లక్ష్యం అసంపూర్ణంగా ఉండగా, భారతదేశం కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలలో ఆధిక్యాన్ని పొందింది.

కాల్పుల విరమణను అమలు చేసిన ఐక్యరాజ్యసమితి..
ఈ యుద్ధం యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితి కూడా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి దౌత్య జోక్యం తర్వాత సెప్టెంబర్ 23, 1965న యుద్ధం ముగిసింది. దీని తరువాత జనవరి 10, 1966న, సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంలో అప్పటి భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఒకదానికొకటి ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.

ఈ యుద్ధంలో భారతదేశం తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. అలాగే భారత లౌకికవాదం పునాది చాలా బలంగా ఉందని నిరూపించింది. ఎందుకంటే కాశ్మీర్ ముస్లింలు తమకు మద్దతు ఇస్తారనే పాక్ ఆశ విఫలమైంది. భారతదేశం శాంతిని కోరుకుంటున్నప్పటికీ, దేశ భద్రత విషయానికి వస్తే, ఏ సవాలుకైనా తగిన సమాధానం ఇవ్వగలదని ఈ యుద్ధం ప్రపంచానికి చూపించింది. ఈ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు.. 1962 యుద్ధంలో భారతదేశం ఓటమి తర్వాత కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు చిహ్నంగా నిలిచింది.

READ ALSO: Digital Fasting: బాసు డిజిటల్ ఉపవాసం తెలుసా.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి

Exit mobile version