Rajeev Shukla: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ చుట్టూ ఇప్పటికే అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేరును పాక్ మీడియా వివాదంలోకి లాగింది. దీంతో ఆయన స్వయంగా ముందుకొచ్చి అసలు నిజం ఏంటో స్పష్టంచేశారు. పాకిస్థాన్‌లోని ఒక టీవీ షోలోని ఓ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ శుక్లా మాట్లాడినట్టుగా ఒక వీడియో ప్రసారం చేశారు. ఆ వీడియోలో ఆయన, పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకుని భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోవడంపై వ్యాఖ్యానించినట్టు చూపించారు. ఈ వీడియో ARY న్యూస్‌లో ప్రసారమైంది. కానీ రాజీవ్ శుక్లా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆ వీడియో ఏఐ జనరేటెడ్ అని స్పష్టం చేశారు. అందులో వినిపిస్తున్న వ్యాఖ్యలు తనవికావని తేల్చేశారు. “నా వ్యాఖ్యలతో ఉన్న వీడియోను AIతో మార్చి తప్పుడు ఆడియో జత చేశారు. అవి నా మాటలు కావు. ఇలాంటి తప్పుదారి పట్టించే వీడియోలను నమ్మకండి, షేర్ చేయకండి. ఎక్కడ కనిపించినా రిపోర్ట్ చేయండి” అని రాజీవ్ శుక్లా ఎక్స్ లో రాసుకొచ్చారు.
READ MORE: Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్‌కు 23 ఏళ్లు.. ఛాలెంజింగ్‌గా మారిన ఆ కేసులు..
ఈ వీడియోలో ఏముంది?
ఆ మోర్ఫ్ చేసిన వీడియోలో పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడేందుకు ఒప్పించమని బీసీసీఐ కోరినట్లు, ఐసీసీ ప్రతినిధి జోక్యం చేసుకుని పరిష్కారం తీసుకొచ్చినట్లు చూపించారు. దీంతో పాకిస్థాన్-ఐసీసీ మధ్య జరిగిన చర్చలపై తప్పుడు కథనం బయటకు వచ్చింది. అసలు విషయానికి వస్తే, పాకిస్థాన్ ముందుగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. అయితే ఐసీసీతో జరిగిన చర్చల తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ పరిణామాలపై మంగళవారం మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా, ఐసీసీకి ప్రశంసలు తెలిపారు. “ఐసీసీ ప్రతినిధి ప్రారంభించిన చర్చలు, ఐసీసీ ఛైర్మన్ పర్యవేక్షణలో జరిగిన చర్చల ఫలితంగా పరిష్కారం లభించింది. లాహోర్‌కు వెళ్లి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ బోర్డుతో మాట్లాడిన ప్రతినిధుల ప్రయత్నం వల్లే ఈ స్నేహపూర్వక పరిష్కారం దొరికింది. క్రికెట్‌కు ప్రాధాన్యత ఇచ్చేలా మంచి నిర్ణయం తీసుకున్నారు,” అని చెప్పారు. అంటే, అసలు వ్యాఖ్యల్లో ఎక్కడా బీసీసీఐ ఒత్తిడి లేదా పాకిస్థాన్‌పై ఒప్పించే ప్రయత్నం గురించి శుక్లా చెప్పలేదు. కానీ మార్పులు చేసిన వీడియో మాత్రం వేరేలా చూపించింది.
A video of my remarks on the India Pakistan World Cup match has been manipulated using AI to alter the audio. These statements are not mine. I urge everyone not to believe or circulate this misleading content and to report it wherever such videos are seen.
— Rajeev Shukla (@ShuklaRajiv) February 11, 2026
