Site icon NTV Telugu

Indian Navigation App: ఇకపై గూగుల్ మ్యాప్స్ కాదు.. “నావిక్”

Indian Navigation App

Indian Navigation App

Indian Navigation App: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇండియాలోని ప్రతి మొబైల్ ఫోన్‌లో స్వదేశీ నావిగేషన్ సాఫ్ట్‌వేర్ నావిక్‌ రాబోతుంది. ఇకపై ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ భారత్‌లో గూగుల్ మ్యాప్స్ మాదిరిగానే నావిక్ యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా అందించాలనే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే గూగుల్ మ్యాప్స్‌ను నావిక్ యాప్‌తో భర్తీ చేస్తుందా లేదా గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని అందుబాటులోకి తెస్తుందా అనేది ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు.

READ ALSO: Family Car: 7 సీట్ల కారు కావాలా.. తక్కువ బడ్జెట్ లో ఉత్తమ ఫ్యామిలీ కార్లు ఇవే

డేటా దేశం దాటద్దని..
భారతీయుల డేటా దేశం విడిచి వెళ్లకుండా చూసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. వాస్తవానికి గూగుల్ సహా అనేక యాప్‌ల సర్వర్లు దేశం వెలుపల ఉన్నాయి. అవి భారతీయుల డేటాను వాళ్లకు తగినట్లుగా ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే వినియోగదారుల భద్రత, సాంకేతికత గురించి, జాతీయ భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. అందుకే ప్రభుత్వం నావిక్ పై దృష్టి సారించినట్లు సమాచారం. ఇది ప్రారంభం మాత్రమే అని, ప్రతి సర్వర్‌కు భారతదేశంలో తయారు చేసిన చిప్‌ను తప్పనిసరి చేయడంతో సహా ప్రభుత్వం అనేక ఇతర చర్యలు కూడా తీసుకు రానున్నట్లు సమాచారం.

ఇదే కాకుండా CCTV కెమెరాలలో అమర్చిన ప్రతి చిప్ దేశీయమైనదిగా ఉండేలా కేంద్రం నిబంధనలు తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే వీటి కోసం నియమాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా అన్ని భారతీయ డేటా, భద్రతా ఆడిట్‌లు నిర్వహించనున్నారు. అలాగే అనేక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ మొత్తం వ్యవస్థలను ఇమెయిల్ నుంచి డాక్యుమెంట్ షేరింగ్ వరకు, విదేశీ కంపెనీల సాఫ్ట్‌వేర్ నుంచి భారతీయ కంపెనీ జోహోకు మార్చాయి.

వాస్తవానికి ఈ ప్రక్రియను ఇప్పటికిప్పుడు ప్రారంభించింది కాదని, దీని కోసం సరైన టెండర్ ప్రక్రియ కూడా జరిగిందని సమాచారం. ఈ పనిని జోహో కంపెనీకి అకస్మాత్తుగా అప్పగించలేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాల పరంగా భారతీయ కంపెనీలు, విదేశీ కంపెనీలతో పోల్చదగినవిగా ఉన్నప్పుడు, ఈ పనులకు విదేశీ కంపెనీలను ఎందుకు ఎంచుకోవాలి? అనే ప్రశ్న నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా రైల్వే నావిగేషన్ కోసం మాపుల్‌తో ప్రభుత్వం త్వరలో ఒక అవగాహన ఒప్పందం (MoU) కూడా కుదుర్చుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: CDSCO Drug Alert: CDSCO పరీక్షల్లో 112 మందులు ఫెయిల్.. ఒక్కటి నకిలీ!

Exit mobile version