India Final Warning to Apple: భారతదేశంలో అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) యాపిల్‌కు తుది హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ త్వరగా స్పందించకపోతే, యాంటీట్రస్ట్ కేసును యాపిల్ సహకారం లేకుండానే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దీంతో యాపిల్‌పై రూ.3 లక్షల కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందా? అనే చర్చ ఊపందుకుంది.
అసలు యాపిల్–CCI మధ్య వివాదం ఏమిటి?
ఈ కేసు ప్రధానంగా iOS యాప్ స్టోర్ వ్యాపార విధానాలకు సంబంధించినది. యాప్ డెవలపర్లపై యాపిల్ అన్యాయమైన నిబంధనలు విధిస్తూ, తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచే పలువురు భారతీయ స్టార్టప్‌లు మరియు కంపెనీలు CCIకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు అనంతరం, 2024లో యాపిల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందని CCI నివేదికలో పేర్కొంది. అయితే ఈ నివేదికపై యాపిల్ తన అభ్యంతరాలు మరియు జరిమానాపై వివరణను సమర్పించడంలో తీవ్రంగా ఆలస్యం చేసింది.
అయితే, CCI ఆదేశాల ప్రకారం, యాపిల్ అక్టోబర్ 2024 నాటికి తన స్పందనను ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి కంపెనీ వరుసగా గడువు పొడిగింపులు కోరుతూ వచ్చింది. దీంతో విసిగిపోయిన CCI, ఇకపై ఏ విధమైన పొడిగింపులు ఉండవని స్పష్టం చేస్తూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారం లోపు యాపిల్ స్పందించకపోతే, కేసును ఏకపక్షంగా (ex-parte) కొనసాగిస్తామని CCI హెచ్చరించింది. ఇది యాపిల్‌కు పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.3 లక్షల కోట్ల జరిమానా భయం..!
ఈ కేసులో అత్యంత కీలక అంశం జరిమానా. CCI ప్రపంచ టర్నోవర్ ఆధారంగా జరిమానా విధిస్తే, యాపిల్‌కు సుమారు $38 బిలియన్లు (రూ.3 లక్షల కోట్లకు పైగా) జరిమానా పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇది యాపిల్‌కు భారీ ఆర్థిక దెబ్బగా మారవచ్చు. అయితే, జరిమానా విధించే విధానాన్ని యాపిల్ కోర్టులో సవాలు చేసింది. భారతదేశంలో చేసిన వ్యాపారంపై మాత్రమే జరిమానా విధించాలి అని కంపెనీ వాదిస్తోంది. అయితే, పెద్ద గ్లోబల్ కంపెనీల విషయంలో ప్రపంచ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిందే అన్నది CCI వాదన. ఈ వ్యవహారంపై మొత్తం కేసును నిలిపివేయాలని యాపిల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా, CCI ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసుపై తదుపరి విచారణ జనవరి 27, 2026న ఢిల్లీ హైకోర్టులో జరగనుంది.