NTV Telugu Site icon

IND vs ENG: ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్‌ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గ‌వాస్క‌ర్

Virat Kohli Test

Virat Kohli Test

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై చారిత్రాత్మ‌క టెస్టు విజ‌యం సాధించిన భారత్.. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు స‌మ‌రానికి సిద్ధమ‌వుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. బాజ్‌బాల్‌ ఆట‌నే న‌మ్ముకున్న ఇంగ్లీష్ జట్టు భార‌త బౌల‌ర్లపై పై చేయి సాధించాల‌ని చూస్తోంది. అయితే ఉప‌ఖండ పిచ్‌ల‌పై బాజ్‌బాల్‌ ఆడ‌డం క‌ష్ట‌మే అని మాజీ క్రికెట‌ర్లు అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గ‌వాస్క‌ర్ బాజ్‌బాల్‌పై స్పందించాడు. ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్‌ అయితే.. టీమిండియాది విరాట్ బాల్ అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై కోహ్లీకి మెరుగైన రికార్డు ఉందని గుర్తు చేశాడు.

తొలి టెస్టుకు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ… ఇంగ్లండ్ బాజ్‌బాల్ విధానాన్ని ఎదుర్కోవడానికి భారత్‌కు ‘విరాట్‌బాల్’ ఉందన్నారు. ‘ఇంగ్లండ్ బాజ్‌బాల్ ఆట‌ను కౌంట‌ర్ చేసేందుకు మాకు విరాట్ బాల్ ఉంది. ప్ర‌స్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అత‌డు బ్యాటింగ్ చేస్తున్న విధానం, క్రీజులో క‌దిలే తీరు చాలా బాగుంది. టెస్టుల్లో అర్ధ సెంచరీలను సెంచరీలుగా మలచడం చాలా ముఖ్యం. విరాట్ దాదాపు సమానంగా సెంచరీలు, అర్ధ సెంచరీలను కలిగి ఉన్నాడు. ఇవి మంచి గణాంకాలు’ అని గ‌వాస్క‌ర్ చెప్పాడు.

Also Read: Ayodha Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే!

‘గత 1-2 సంవత్సరాలలో టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. ఎటాకింగ్ క్రికెట్ ఆడుతున్నారు. ఈ బాజ్‌బాల్ విధానం భారత స్పిన్నర్లపై పనిచేస్తుందో లేదో చూడాలి. తొలి టెస్ట్ అత్యంత కీలకం. హైదరాబాద్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. బజ్‌బాల్ అప్రోచ్‌కు ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకాబోతుంది’ అని సన్నీ అన్నాడు. 28 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి.