Site icon NTV Telugu

India GDP 2025-26: దేశ జీడీపీ వృద్ధిపై స్పందించిన ప్రధాని మోడీ.. భారత్ లక్ష్యంపై ఆసక్తికర ట్వీట్..

Pm 0modi

Pm 0modi

India’s GDP Growth 2025–26 Projected at 7.4%: 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వాస్తవ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దేశ ఆర్థిక ప్రగతి మరింత వేగం పుంజుకుంటోందని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న పెట్టుబడి ప్రోత్సాహక చర్యలు, డిమాండ్‌ను పెంచే విధానాలే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎక్స్‌ వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. “భారత్‌ రీఫార్మ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంకా వేగంగా ముందుకు సాగుతోంది. మౌలిక సదుపాయాలు, తయారీ రంగానికి ప్రోత్సాహం, డిజిటల్‌ పబ్లిక్‌ గూడ్స్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచుతూ సంపన్న భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్నాం” అని తెలిపారు.

READ MORE: 120Hz రిఫ్రెష్ రేట్, 50MP రియర్ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్తో Vivo X200T

ఈ వ్యాఖ్యలతో పాటు గణాంకాలు, కార్యక్రమాల అమలపై మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జీడీపీ తొలి ముందస్తు అంచనాల ప్రకటనకు సంబంధించిన లింక్‌ను ప్రధాని షేర్‌ చేశారు. ఆ ప్రకటన ప్రకారం.. 2025–26లో నామినల్‌ జీడీపీ 8 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. వాస్తవ జీడీపీ విలువ 2025–26లో రూ.201.90 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో ఇది రూ.187.97 లక్షల కోట్లు. అదే సమయంలో నామినల్‌ జీడీపీ రూ.357.14 లక్షల కోట్లకు చేరనుండగా, గతేడాది ఇది రూ.330.68 లక్షల కోట్లుగా ఉంది. వాస్తవ స్థూల విలువ జోడింపు (జీవీఏ) 2025–26లో రూ.184.50 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది గత ఏడాది రూ.171.87 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని సూచిస్తోంది. నామినల్‌ జీవీఏ రూ.323.48 లక్షల కోట్లకు చేరి 7.7 శాతం వృద్ధి నమోదు చేయనుంది. నామినల్‌ జీడీపీ లెక్కల్లో ద్రవ్యోల్బణ ప్రభావం కూడా ఉంటుంది. వాస్తవ జీడీపీ మాత్రం ధరల ప్రభావాన్ని తీసివేసి నిజమైన ఉత్పత్తి వృద్ధిని చూపిస్తుంది.

READ MORE: Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్

జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వృద్ధికి ప్రధానంగా సేవల రంగమే బలంగా నిలుస్తోంది. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవలు, ప్రజాపాలన, రక్షణ రంగాలు దాదాపు 9.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. తయారీ, నిర్మాణ రంగాలు కూడా ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుండగా, ద్వితీయ రంగం మొత్తం 7 శాతం వృద్ధి సాధించనుంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, ప్రసార సేవలు 7.5 శాతం పెరుగుతాయని అంచనా. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మాత్రం వృద్ధి కొంత నెమ్మదిగా ఉండి సుమారు 3.1 శాతం మాత్రమే నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. డిమాండ్‌ వైపు చూస్తే, ప్రైవేట్‌ వినియోగ వ్యయం 7 శాతం పెరుగుతుందని అంచనా వేయగా, పెట్టుబడుల సూచిక అయిన స్థిర మూలధన ఏర్పాటు 7.8 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇది గత ఏడాది 7.1 శాతంతో పోలిస్తే మెరుగైనదిగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే, 2024–25లో నమోదైన 6.5 శాతం వృద్ధితో పోలిస్తే, 2025–26లో భారత్‌ ఆర్థిక వృద్ధి మరింత వేగంగా సాగుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం స్పష్టం చేసింది.

Exit mobile version