Site icon NTV Telugu

India AMCA Project: అగ్ర దేశాల సరసన భారత్‌ను నిలబెట్టే కీలక ప్రాజెక్ట్.. రూ.15 వేల కోట్ల పోటీలో పెద్దపెద్ద కంపెనీలు

India Amca Project

India Amca Project

India AMCA Project: అగ్రదేశాల సరసన భారత్ చేరడానికి ముమ్మర సన్నాహాలు చేస్తుంది. అమెరికా, రష్యా, చైనాల మాదిరిగానే ఇండియా కూడా తన సొంత ఐదవ తరం స్టెల్త్ ఫైటర్‌ను అభివృద్ధి చేయాలని కలలు కంటోంది. ఇప్పటికే ఈ కలను నిజం చేసుకునే దిశలో ఒక్కో అడుగు వేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం DRDO విభాగం అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EoI) జారీ చేసింది. దీనికి సెప్టెంబర్ 30న గడువు ముగిసింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), లార్సెన్ & టూబ్రో (L&T), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), BEML వంటి అనేక ప్రధాన కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకోడానికి బిడ్‌లను దాఖలు చేశాయి. ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ వ్యయం అంచనా రూ.15 వేల కోట్లు. దీనిని భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన రక్షణ కలగా రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.

READ ALSO: Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పడుకోన్‌

రేసులో ఎవరున్నారు..
ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీ కోసం పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఇప్పటికే బిడ్ దాఖలు చేయడానికి గడువు ముగిసింది. ఏయే కంపెనీలు ఈ పోటీలో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

HAL: భారతదేశపు అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ. గతంలో యుద్ధ విమానాల సరఫరాదారుగా కూడా ఉంది.

L&T + BEL: ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి బిడ్డింగ్ వేశాయి.

BEML: ఈ ప్రాజెక్ట్ చేజిక్కించుకోవాలని ఈ కంపెనీ పలు ప్రైవేట్ కంపెనీలతో పొత్తు పెట్టుకొని బిడ్ దాఖలు చేసింది.

పైన పేర్కొన్న కంపెనీలు దాఖలు చేసిన బిడ్‌లను ఇప్పుడు బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ చీఫ్ ఎ.శివథాను పిళ్లై నేతృత్వంలోని కమిటీ పరిశీలించి, తుది నివేదికను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది. AMCA ప్రాజెక్టుకు గత సంవత్సరం భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. నాటి నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అనుకున్న తేదీల ప్రకారం ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించేలా, ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగేలా చూసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్వయంగా DRDO, ADA లతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు.

ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు ఏమిటంటే..
ఈ దశలో ఎంపిక చేసిన కంపెనీ ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేయడంలో సహ భాగస్వామిగా ఉండనుంది. అలాగే భవిష్యత్తులో ఈ జెట్ ఉత్పత్తికి కూడా బాధ్యత తీసుకోనుంది.
కాలక్రమం: భారత వైమానిక దళం 2034 – 35 నాటికి తన మొదటి AMCA స్క్వాడ్రన్‌ను పొందే అవకాశం ఉందని అంచానా.
స్కేల్: కనీసం 125 విమానాలు, అంటే 7 స్క్వాడ్రన్లు.
విలువ: దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి ప్రాజెక్ట్.

AMCA ప్రాజెక్ట్ ఎందుకు స్పెషల్..
ప్రస్తుతం అమెరికా (F-35), రష్యా (Su-57), చైనా (J-20) వంటి దేశాలు మాత్రమే ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను కలిగి ఉన్నాయి. ఈ దేశాల సరసన AMCA భారతదేశాన్ని నిలబెడుతుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త ఫైటర్ జెట్‌లో ప్రత్యేకతలు ఏమిటంటే.. స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం (ఆఫ్టర్‌బర్నర్ లేకుండా సుదీర్ఘమైన సూపర్‌సోనిక్ విమాన ప్రయాణం), బహుళ పాత్ర ఆయుధ క్యారేజ్. రాబోయే కాలంలో యుద్ధ అవసరాలకు అనుగుణంగా ఇది IAF కి కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

AMCA అనేది కేవలం ఒక యుద్ధ విమానాల ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక కీలక మలుపు వంటిది. ఇది దీర్ఘకాలికంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు పెద్ద ఆర్డర్‌లను ఉత్పత్తి చేస్తుంది. హై-టెక్నాలజీ భాగస్వామ్యాలను ఏర్పరచడంతో పాటు, భారతదేశ అంతరిక్ష పరిశ్రమను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.

READ ALSO: Fatah 4 vs BrahMos: భారత బ్రహ్మోస్ లాంటి క్షిపణిని పాక్ సొంతంగా తయారు చేసిందా! ఫతా-IV తో ఇండియాకు ప్రమాదం ఎంత?

Exit mobile version