NTV Telugu Site icon

Parliament: ఝార్ఖండ్, ప్రత్యేక దేశం‌పై లోక్‌సభలో రగడ.. విపక్షాల వాకౌట్

Parliment

Parliment

పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రారంభమైన రెండ్రోజులు సాఫీగా సాగినా శుక్రవారం మాత్రం హాట్ హాట్‌గా నడిచాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభమైంది.. గురువారం మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రసంగంతో ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మాత్రం ఉభయ సభలు ప్రారంభం కాగానే ఇండియా కూటమి సభ్యులు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఉభయ సభలు గందరగోళం చోటుచేసుకుంది.

రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. బీహార్‌లో నితీష్‌కుమార్ (Nitish Kumar) రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని.. ఝార్ఖండ్‌లో కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న కూడా ప్రమాణస్వీకారానికి మాత్రం ఆలస్యం చేశారని ఆరోపించారు. బీజేపీ జోక్యంతోనే ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

ఖర్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి పీయూస్ గోయల్ ఖండించారు. ఝార్ఖండ్‌లో జరిగిన భూకుంభకోణం కారణంగానే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారని.. ఆ కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందా? అని కేంద్రమంత్రి నిలదీశారు. ఇదే అంశంపై లోక్‌సభలోనూ రచ్చ నడిచింది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఇదిలా ఉంటే మధ్యంతర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇలాగైతే సౌతిండియాను ప్రత్యేక దేశంగా చేయాలంటూ డిమాండ్ చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (DK Suresh) గురువారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. సోనియాగాంధీ (Sonia Gandhi) క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రులు పీయూస్ గోయల్, ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. ప్రత్యేక దేశ డిమాండ్‌ను కాంగ్రెస్ అంగీకరించబోదని తేల్చిచెప్పారు. డీకే సురేష్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

Show comments