NTV Telugu Site icon

IND vs ZIM: విశ్వవిజేత టీమిండియాపై విజయం.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే!

Zimbabwe Team

Zimbabwe Team

Zimbabwe Record vs India: ప‌సికూన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్‌పై అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసుకున్న జట్టుగా రికార్డులో నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం హరారే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా జింబాబ్వే ఖాతాలో ఈ రికార్డు చేరింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు.

ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 127 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ కాపాడుకుంది. తాజాగా కివీస్ ఆల్‌టైమ్ రికార్డును జింబాబ్వే బద్దలు కొట్టింది. ప‌సికూన జింబాబ్వే విశ్వవిజేత అయిన టీమిండియాపై విజయం ఇంత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం విశేషం. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ ప్లేయర్స్.. దారుణ ప్రదర్శన చేశారు.

Also Read: Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్‌ను ఎందుకు తప్పించారు?

ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. మడాండే (29 నాటౌట్‌; 25 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. రవి బిష్ణోయ్‌ (4-2-13-4), వాషింగ్టన్‌ సుందర్‌ (4-0-11-2) చెలరేగారు. అనంతరం రజా (3/24), చటార (3/16)ల ధాటికి యువ భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మన్‌ గిల్‌ (31; 29 బంతుల్లో 5×4), వాషింగ్టన్‌ సుందర్‌ (27; 34 బంతుల్లో 1×4, 1×6) మినహా అందరూ తేలిపోయారు.