Who Is India Bowling Coach Sairaj Bahutule: శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత్ జట్టు నేడు అక్కడికి బయల్దేరనుంది. జూన్ 27 నుంచి టీ20 సిరీస్, ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే హెడ్ కోచ్‌గా గౌతమ్ ఎంపికయినా.. సహాయక సిబ్బంది ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. గౌతీ సిఫార్సు చేసిన జాబితాలో కొందరికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరికొందరిని మాత్రం అంగీకరించట్లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కౌటెల ఎంపిక దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. బౌలింగ్ కోచ్ రేసులో భారత మాజీ పేసర్లు ఆర్ వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీలతో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజం మోర్నీ మోర్కెల్ రేసులో ఉన్నారు. గంభీర్ మాత్రం మోర్నీనే కావాలని బీసీసీఐతో చెప్పాడట. బౌలింగ్ కోచ్ విషయంలో భారత మాజీ క్రికెటర్లనే ఎంపిక చేయాలని బీసీసీఐ భావించినా.. గౌతీ మాత్రం మోర్నీనే కావాలంటున్నాడట. దాంతో శ్రీలంక టూర్ కోసం తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులేని బీసీసీఐ నియమించింది. ఇంతకీ ఎవరీ బహుతులే అని నెటిజన్స్ నెట్టింట ఆరా తీస్తున్నారు.
Also Read: Richa Ghosh Record: రిషబ్ పంత్ రికార్డ్ బద్దలు కొట్టిన రిచా ఘోష్!
భారత్ తరఫున సాయిరాజ్ బహుతులే 2 టెస్టులు, 8 వన్డేలు ఆడారు. 1997లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన బహుతులే.. రెండు ఫార్మాట్‌లలో కలిపి 5 వికెట్లు పడగొట్టి, 62 రన్స్ చేశారు. లెగ్ స్పిన్నర్ అయిన బహుతులేకు కోచ్‌గా మంచి అనుభవం ఉంది. 2014లో కేరళ క్రికెట్ జట్టుకు, 2015లో బెంగాల్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆయన సేవలు అందిస్తున్నారు. శ్రీలంక పర్యటన అనంతరం బహుతులే తిరిగి ఎన్‌సీఏకు చేరనున్నారు. లంక పర్యటన లోగా బీసీసీఐ సహాయక సిబ్బంది ఎంపిక పూర్తవుతుంది.